అంతర్జాతీయం

చైనాతో చర్చలు వల్ల ఎలాంటి ప్రయోజనంలేదు : అమెరికా జాతీయ భద్రతా సలహాదారు

భారత్‌తో సరిహద్దులు పంచుకుంటున్న చైనా.. ఇరుదేశాల మధ్య ఉన్న వాస్తవాధీన రేఖను ఏకపక్షంగా స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తోందని అమెరికా స్పష్టం చేసింది..

చైనాతో చర్చలు వల్ల ఎలాంటి ప్రయోజనంలేదు : అమెరికా జాతీయ భద్రతా సలహాదారు
X

భారత్‌తో సరిహద్దులు పంచుకుంటున్న చైనా.. ఇరుదేశాల మధ్య ఉన్న వాస్తవాధీన రేఖను ఏకపక్షంగా స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తోందని అమెరికా స్పష్టం చేసింది. చైనాతో చర్చలు జరపడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని.. భారత్‌ ఇకనైనా అర్థం చేసుకోవాలని హితవు పలికింది. భారత్‌-చైనా మధ్య ఇటీవల నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్ని ఉద్దేశిస్తూ అగ్రరాజ్యం జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్‌ ఓబ్రియెన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్‌తో పాటు తైవాన్‌ విషయంలోనూ చైనా కమ్యూనిస్టు పార్టీ ప్రాదేశిక దురాక్రమణకు పాల్పడేందుకు కుట్రలు పన్నుతోందని తెలిపారు.

'వన్‌ బెల్ట్‌ వన్‌ రోడ్‌' ప్రాజెక్టు వెనుక ఉన్న చైనా దురుద్దేశాన్ని ఓబ్రియెన్‌ తప్పుబట్టారు. ఈ ప్రాజెక్టులో భాగమైన కంపెనీలు బలవంతంగా తమ నుంచి రుణాలు తీసుకునే పరిస్థితిని చైనా సృష్టిస్తుందని తెలిపారు. తిరిగి చైనా కంపెనీలు వాటిలో పనిచేసే కార్మికులకే ఆ సొమ్మును చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. ప్రాజెక్టులో భాగంగా నిర్మించే మౌలిక సదుపాయాలు చైనాకు మాత్రమే లబ్ధి చేకూరుస్తాయని అన్నారు. చైనా వద్ద అప్పులు చేసే దేశాలు దీర్ఘకాలంలో వాటి సార్వభౌమత్వాన్ని కోల్పోయే ప్రమాదం రావొచ్చని స్పష్టం చేశారు. చివరకు గత్యంతరం లేక సీసీపీ తీసుకునే దురుద్దేశపూరిత నిర్ణయాలకు తలొగ్గాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని వివరించారు.

ఇతర దేశాలకు చైనా అందిస్తున్న సాంకేతిక, రక్షణపరమైన సాయం వెనుక దురుద్దేశాన్ని ఓబ్రియెన్‌ వివరించారు. ట్రంప్‌ సర్కార్‌ చైనాకు కళ్లెం వేసేందుకు అనేక చర్యలు చేపట్టిందని తెలిపారు. అందులో భాగంగా ఆ దేశానికి చెందిన కంపెనీలపై ఆంక్షలు విధించిందని పేర్కొన్నారు. హువావే పరికరాల కొనుగోలుపై విధించిన నిషేధాన్ని ఉటంకించారు. అదే బాటలో భారత్‌కు చెందిన జియో సైతం 5జీ సాంకేతికతలో హువావే పరికరాల్ని పూర్తిగా నిషేధించిందని గుర్తుచేశారు.

ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో చైనా దూకుడుకు కళ్లెం వేసేందుకు అక్కడి ప్రాంతీయ దేశాలతో వ్యూహాత్మక సంబంధాలు పెంపొందించుకుంటున్నట్టు ఓబ్రియెన్‌ తెలిపారు. అందులో భాగంగా భారత్‌తో ఏర్పడిన భాగస్వామ్యం 21వ శతాబ్దంలో అమెరికాకు అత్యంత కీలకమని స్పష్టం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో చైనాతో చర్చలు జరపడం వల్ల సీసీపీ వైఖరిలో ఎలాంటి మార్పు ఉండదని ఇకనైనా గ్రహించాలని ఓబ్రియెన్‌ హితవు పలికారు. డ్రాగన్‌తో మెతక వైఖరి వల్ల ఉపయోగం శూన్యమని అభిప్రాయపడ్డారు.

Next Story

RELATED STORIES