అమెరికాలో అధికార మార్పిడిపై కొరవడిన స్పష్టత

అమెరికాలో అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్ గెలుపును 'జనరల్ సర్వీసెస్ అడ్మినిస్ట్రేషన్'-జీఎస్‌ఏ విభాగం అధికారికంగా గుర్తించకపోవడంతో... అధికార బదిలీ సంక్లిష్టంగా మారింది. ఎన్నికల్లో విజేతపై స్పష్టత రాగానే జీఎస్‌ఏ గుర్తింపుతో... అధికార బదిలీ ప్రక్రియ ప్రారంభమవుతుంది. కానీ.. జీఎస్‌ఏ నుంచి అధికార బదిలీపై ఎలాంటి ప్రకటన వెలువడలేదు. బైడెన్ గెలుపును జీఎస్‌ఏ గుర్తించనంత కాలం... ఆయన అధికార బదిలీ, వేతనాలు చెల్లింపు, ప్రయాణాల ఖర్చు, కీలక సమాచారం తెలుసుకోవడం వంటి వాటికి అనుమతి లభించదు. పైగా వివిధ దేశాలకు చెందిన నేతలతో మాట్లాడేందుకు విదేశాంగశాఖలోకి సైతం బైడెన్ బృందాన్ని అనుమతించరు. ఓటమిని ట్రంప్ అంగీకరించకపోవడం వల్లే జీఎస్‌ఏ... గుర్తింపులో జాప్యం చేస్తున్నట్టు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జీఎస్‌ఏ తీరుపై బైడెన్ బృందం చట్టపరమైన చర్యలను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఒటమిని అంగీకరించని ట్రంప్... బైడెన్ గెలుపువై విమర్శలు కొనసాగిస్తున్నారు. తాజాగా జరిగిన ఎన్నికలు రిగ్గింగ్ ఎన్నికలు అని ట్రంప్ ఆరోపించారు. మీడియా ఫేక్ కథనాల్లోనే బైడెన్ గెలిచారని వ్యాఖ్యానించారు. వీటిని తాను అంగీకరించనని ట్వీట్ చేశారు.
మరోవైపు... రాజధాని వాషింగ్టన్‌లో ట్రంప్ మద్దతుదారులు చేపట్టిన ఆందోళనలు... హింసాత్మకంగా మారాయి. ట్రంప్ మద్దతుదారులకు..... ప్రత్యర్థి వర్గం 'ఎదురుపడటంతో.. ఒకరికొకరు వ్యతిరేక నినాదాలు చేసుకున్నారు. నినాదాలు శృతి మించి... బాహాబాహీకి దిగారు. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. చీకటి పడుతున్న కొద్దీ ఘర్షణ తీవ్రమైంది. ట్రంప్ మద్దతుదారుల చేతిలోని టోపీలు, జెండాల్ని లాక్కొని ప్రత్యర్థి వర్గం తగలబెట్టింది. టోపీలు, జెండాలు అమ్ముతున్న టేబుళ్లను ధ్వంసం చేసింది. పరిస్థితి ఓ దశలో చేజారిపోయింది. ఘర్షణ మొత్తం శ్వేతసౌధానికి సమీపంలోని ఫ్రీడం ప్లాజా వద్ద జరిగింది.
ట్రంప్ మద్దతుదారులు, వ్యతిరేకుల మధ్య జరిగిన ఘర్షణలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో పోలీసులు కూడా ఉన్నట్లు వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. 20 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఘర్షణలో ఓ వ్యక్తిని గుర్తుతెలియని దుండగులు కత్తితో పొడిచినట్టు ప్రత్యక్షసాక్షులు తెలిపారు. ప్రస్తుతం అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com