Hiv Positive Mothers: హెచ్‌ఐవీ తల్లులు పాలివ్వచ్చు దశాబ్దాల నాటి నిషేధం ఎత్తివేత ఎక్కడంటే ?

హెచ్‌ఐవీతో బాధపడుతున్న తల్లులు తమ పిల్లలకు పాలివ్వడంపై అమెరికాలో దశాబ్దాలుగా ఉన్న నిషేధాన్ని అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ ఎత్తివేసింది. హెచ్‌ఐవీ తల్లులు కూడా పిల్లలకు పాలివ్వొచ్చని స్పష్టం చేసింది. నిషేధాన్ని వెనక్కి తీసుకోవడానికి గల కారణాన్ని కూడా పేర్కొంది. ఎయిడ్స్‌కు దారితీసే హెచ్‌ఐవీతో బాధపడుతున్న వారికి ప్రస్తుతం నాణ్యమైన వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
వారు వాడుతున్న మందులు తల్లిపాల ద్వారా బిడ్డకు వైరస్ సోకే ముప్పును ఒకశాతంలోపునకే పరిమితం చేస్తున్నట్టు కొలరాడో యూనివర్సిటీ హెచ్‌ఐవీ నిపుణురాలు, అధ్యయనానికి నేతృత్వం వహించిన డాక్టర్ లిసా అబౌగి తెలిపారు. హెచ్‌ఐవీని అదుపులో ఉంచే చికిత్సా విధానం దశాబ్దం క్రితం విస్తృతమైంది. అంతకుముందు తల్లిపాల నుంచి పిల్లలకు వైరస్ సోకే ముప్పు 30 శాతంగా ఉంటే ప్రస్తుతం అది ఒక శాతానికి తగ్గిం ది.
1990ల మొదట్లో అమెరికాలో ప్రతి సంవత్సరం 2 వేలమంది చిన్నారులు హెచ్‌ఐవీ బారినపడేవారు. ప్రస్తుతం ఆ సంఖ్య 30 లోపే ఉంది. అమెరికాలో హెచ్‌ఐవీతో బాధపడుతున్న మహిళల్లో ప్రతి ఏటా ఐదువేల మంది బిడ్డలకు జన్మనిస్తున్నారు. హెచ్‌ఐవీ తల్లులు బిడ్డలకు తల్లిపాలు ఇవ్వవద్దంటూ వైరస్ వెలుగు చూసి తొలినాళ్లలో అంటే 1980లలో అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ ప్రతిపాదించింది. ఇప్పుడు చికిత్సా విధానాలు పెరగడం, హెచ్‌ఐవీ సంక్రమణను అదుపులో ఉంచే మెరుగైన మందులు అందుబాటులోకి రావడంతో ఈ నిషేధాన్ని వెనక్కి తీసుకుంది.
అమెరికాలో ఏడాదికి దాదాపు 5 వేల మంది హెచ్ఐవీ బాధిత మహిళలు బిడ్డలను ప్రసవిస్తున్నారు. ఎయిడ్స్‌కు కారణమైన హెచ్ఐవీని నియంత్రించే ఔషధాలు విస్తృతంగా అందుబాటులోకి రావడంతో ప్రస్తుతం వ్యాప్తిస్థాయి గణనీయంగా తగ్గిందని అబౌగీ అన్నారు.
బాధితులను నిందిచడం, అవమానించడం మా ఉద్దేశం కాదని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మార్గదర్శకాలు రూపొందించడంలో సహాయపడిన నార్త్‌వెస్ట్రన్ యూనివర్శిటీ గైనకాలజీ ప్రొఫెసర్ డాక్టర్ లిన్ యీ అన్నారు. ‘తల్లిపాలు పిల్లలకు సరైన పోషకాహారాన్ని అందిస్తుంది.. ఊబకాయం, టైప్ 2 డయాబెటిస్ వంటి అనారోగ్యాల నుంచి వారిని రక్షిస్తుంది.. తల్లికి రొమ్ము, అండాశయ కేన్సర్, మధుమేహం, అధిక రక్తపోటు వచ్చే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందని పరిశోధనలో తేలింది’ అని యీ వ్యాఖ్యానించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com