Donald Trump: పుతిన్‌-జెలెన్‌స్కీ భేటీకి ఏర్పాట్లు

Donald Trump: పుతిన్‌-జెలెన్‌స్కీ భేటీకి ఏర్పాట్లు
X
త్రైపాక్షిక సమావేశం జరిగితే శాంతి స్థాపన సాధ్యమని వ్యాఖ్య

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సోమవారం ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో వైట్‌ హౌస్‌లో సమావేశమయ్యారు. 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై రష్యా దాడి ప్రారంభించిందని, మూడున్నరేళ్ల నుంచి జరుగుతున్న యుద్ధం వల్ల ప్రపంచమంతా అలసిపోయిందని ట్రంప్‌ చెప్పారు. ఈ యుద్ధాన్ని ఆపడానికి అమెరికా, రష్యా, ఉక్రెయిన్‌ మధ్య త్రైపాక్షిక సమావేశం జరగాలన్నారు. ఈ సమావేశంలో ట్రంప్‌, జెలెన్‌స్కీ చిరునవ్వులు చిందిస్తూ మాట్లాడుకున్నారు. ఈ సమావేశంలో మంచి పురోగతి కనిపిస్తున్నదని, ఓవల్‌ ఆఫీస్‌లో జెలెన్‌స్కీ తనతోపాటు ఉండటం గౌరవప్రదమని ట్రంప్‌ అన్నారు. జెలెన్‌స్కీ మాట్లాడుతూ, హత్యలు, యుద్ధాన్ని ఆపడానికి వ్యక్తిగతంగా కృషి చేస్తున్నందుకు ట్రంప్‌నకు ధన్యవాదాలు చెప్పారు. అందరి క్షేమం కోసం తాము యుద్ధం ఆగిపోవాలని కోరుకుంటున్నామన్నారు.

ఉక్రెయిన్‌ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ట్రంప్‌ మాట్లాడుతూ, ప్రతిపాదిత త్రైపాక్షిక సమావేశం వల్ల ఉక్రెయిన్‌ యుద్ధం ఆగిపోవడానికి మంచి అవకాశం వస్తుందని, లేదంటే మరణాలు కొనసాగుతాయని హెచ్చరించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ కూడా ఈ యుద్ధం ముగిసిపోవాలని కోరుకుంటున్నారని అభిప్రాయపడ్డారు. తాము ఉక్రెయిన్‌తో, అందరితో కలిసి పని చేస్తామని తెలిపారు. శాంతి ఏర్పడితే, అది సుదీర్ఘ కాలం కొనసాగుతుందన్నారు. తాము రెండేళ్లపాటు ఉండే శాంతి గురించి, ఆ తర్వాత మళ్లీ ఈ ఘర్షణల్లో మునిగిపోవడం గురించి మాట్లాడటం లేదని తెలిపారు. కాగా, ఇంతకుముందు ఈ ఏడాది ఫిబ్రవరిలో ఓవల్‌ ఆఫీస్‌ వేదికగా ట్రంప్‌, జెలెన్‌స్కీ మధ్య మాటల యుద్ధం నడిచిన నేపథ్యంలో జెలెనెస్కీకి మద్దతుగా ట్రంప్‌తో భేటీ అయ్యేందుకు ఐరోపా, నాటో నేతలు కూడా తరలివచ్చారు. జెలెన్‌స్కీతో భేటీ అనంతరం వీరితో ట్రంప్‌ సమావేశం కానున్నారు. క్రిమియాను వాపసు తీసుకోవాలని, నాటోలో చేరాలని కంటున్న కలలను వదులుకోవాలని చర్చలకు ముందు జెలెన్‌స్కీకి ట్రంప్‌ స్పష్టంచేశారు.

అలస్కా: రష్యా అధ్యక్షుడు పుతిన్‌ గత వారం అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో అలస్కాలో సమావేశమైనప్పుడు ఆయన అంగ రక్షకులు ఒక ప్రత్యేకమైన ‘మలం సూట్‌ కేస్‌’ మోసుకెళ్లడం కనిపించింది. భద్రతా కారణాల రీత్యా పుతిన్‌ విదేశాలకు వెళ్లినప్పుడు అక్కడ ఆయన మానవ వ్యర్థాలను, విసర్జితాలను సేకరించి వాటిని తిరిగి రష్యాకు తీసుకెళతారని పలు వార్తా కథనాలు వెలువడ్డాయి. పుతిన్‌ మానవ వ్యర్థాలు విదేశీ శక్తులకు లభిస్తే ఆయన ఆరోగ్యానికి సంబంధించిన సున్నిత సమాచారం నిఘా వర్గాలకు లభిస్తుందని భావించి ఇలా విదేశీ యాత్రల్లో పుతిన్‌ మలాన్ని సూట్‌ కేసుల్లో భద్రపరచి రష్యాకు తీసుకెళుతున్నారు.

Tags

Next Story