Tesla Cars : టెస్లాపై దాడి చేస్తే 20 ఏండ్లు జైలు శిక్ష తప్పదు

Tesla Cars : టెస్లాపై దాడి చేస్తే 20 ఏండ్లు జైలు శిక్ష తప్పదు
X
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాస్ వార్నింగ్

టెస్లా ఆస్తులపై దాడులు చేస్తే ఖబడ్దార్ అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఎవరైనా టెస్లా ఆస్తులపై దాడుల చేస్తే 20 ఏళ్లు జైలు శిక్ష విధిస్తామని హెచ్చరించారు. ఇటీవల టెస్లా కార్ల షోరూమ్‌కి నిప్పుపెట్టారు. పలు కార్లు దగ్ధమయ్యాయి. ఇది ఉగ్ర చర్యగా టెస్లా అధినేత ఎలోన్ మస్క్ ఆరోపించారు. తాజాగా ఇదే అంశంపై ట్రంప్ స్పందిస్తూ.. టెస్లా ఆస్తులు ధ్వంసం చేసే వారికి 20 సంవత్సరాలు వరకు జైలు శిక్ష పడుతుందని వార్నింగ్ ఇచ్చారు.

ప్రస్తుతం మస్క్… ట్రంప్ సలహాదారుడిగా ఉన్నారు. ఇటీవల టెస్లా కారును ట్రంప్ కొనుగోలు చేశారు. అద్భుతంగా ఉందంటూ కితాబు ఇచ్చారు. ఇక ప్రభుత్వ నిర్ణయాల్లో మస్క్ పెత్తనంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఆయన ఆస్తులకు సంబంధించిన వాటిపై ప్రపంచ వ్యాప్తంగా పలు చోట్ల దాడులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ ట్రూత్ సోషల్‌లో స్పందిస్తూ.. టెస్లా ఆస్తులపై దాడులు చేస్తే 20 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. దాడులు ప్రోత్సహించేవారికి కూడా అదే శిక్ష పడుతుందన్నారు. ప్రస్తుతం యూఎస్‌తో పాటు కెనడాలో కూడా టెస్లా ఆస్తులపై దాడులు జరుగుతున్నాయి. షోరూమ్‌లు, వాహన స్థలాలు, ఛార్జింగ్ స్టేషన్లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారు.

కాగా, ట్రంప్‌ ప్రభుత్వంలో కీలక బాధ్యతలు చేపట్టిన టెస్లా బాస్‌ ఎలాన్‌ మస్క్‌ పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ట్రంప్ ఏర్పాటు చేసిన డోజ్‌ శాఖ అధిపతిగా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫెడరల్‌ ఉద్యోగుల తొలగింపుతో టెస్లాను బహిష్కరించాలంటూ అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. పలుచోట్ల నిరసనకారులు విధ్వంసానికి పాల్పడుతున్నారు.

రెండు రోజుల క్రితం లాస్‌ వెగాస్‌లో ఉన్న టెస్లా షోరూంలోని ఐదు కార్లకు దుండగులు నిప్పంటించారు. ఈ ఘటనలో ఆ కార్లు మంటల్లో కాలి బూడిదయ్యాయి. అంతేకాదు, ఓ కారుపై అభ్యంతరకర వ్యాఖ్యలతో స్ప్రే పెయింట్‌ చేశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపు చేశారు. మరోవైపు కాన్సాస్‌ సిటీలో రెండు టెస్లా సైబర్‌ ట్రక్కులను దుండగులు తగలబెట్టారు. దక్షిణ కొరోలినాలో టెస్లా ఛార్జింగ్‌ స్టేషన్‌కు నిప్పంటించే ప్రయత్నం కూడా జరిగింది. ఇలా వరుస ఘటనలతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ దాడి ఘటలను టెస్లా బాస్‌ ఎలాన్‌ మస్క్‌ ఉగ్రవాద చర్యగా అభివర్ణించారు.

Tags

Next Story