Trump-Zelensky: జెలెన్‌స్కీకి ట్రంప్ ఫోన్..

Trump-Zelensky: జెలెన్‌స్కీకి ట్రంప్ ఫోన్..
X
తాత్కాలిక కాల్పుల విరమణకు ఉక్రెయిన్-రష్యా అంగీకారం!

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తో మంగళవారం చర్చలు జరిపిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ బుధవారం ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీతోనూ ఫోన్‌లో మాట్లాడారు. ఉక్రెయిన్‌ యుద్ధాన్ని ఆపేందుకు కృషి చేస్తున్న ట్రంప్‌.. 30 రోజుల కాల్పుల విరమణ ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీనికి కీవ్‌ అంగీకరించినా.. మాస్కో మాత్రం షరతులు పెట్టింది. పుతిన్‌తో జరిపిన చర్చల ఆధారంగానే జెలెన్‌స్కీతో సంభాషణ సాగిందని అమెరికా అధ్యక్షుడు తెలిపారు. ఉక్రెయిన్‌లోని విద్యుత్తు ప్లాంట్లను భద్రత నిమిత్తం తమకు అప్పగించాలని ట్రంప్‌ సూచించినట్లు అమెరికా విదేశాంగమంత్రి మార్క్‌ రుబియో తెలిపారు.

ఇంధన కేంద్రాలపై పరస్పరం దాడులు చేసుకోవడం ఆపుతామని ట్రంప్‌తో చర్చల సందర్భంగా పుతిన్‌ అంగీకరించి 24 గంటలు గడవకముందే.. ఉక్రెయిన్, రష్యాలు ఇంధన కేంద్రాలపై పరస్పరం దాడులు చేసుకున్నాయి. మాస్కోయే ఉల్లంఘించిందని కీవ్‌ ఆరోపిస్తే, ఉక్రెయినే దాడులు చేసిందని రష్యా పేర్కొంది. ఈ దాడులు, ప్రతిదాడులు జరుగుతున్న సమయంలోనే రెండు దేశాలు 175 మంది యుద్ధ ఖైదీలను మార్పిడి చేసుకోవడం గమనార్హం.

ఇక ట్రంప్‌తో ఫోన్ సంభాషణపై జెలెన్‌స్కీ కీలక ప్రకటన చేశారు. చాలా సానుకూల సంభాషణ , స్పష్టమైన సంభాషణ జరిగినట్లుగా పేర్కొన్నారు. ట్రంప్‌తో ఫోన్ సంభాషణ తర్వాత ఈ వారం సౌదీ అరేబియాలో పాక్షిక కాల్పుల విరమణకు సంబంధించిన సాంకేతిక చర్చలు జరుగుతాయని జెలెన్‌స్కీ ధృవీకరించారు. అయితే పుతిన్… ఉక్రెయిన్‌కు సైనిక సహాయాన్ని నిలిపివేయాలని షరతుల జాబితాను సమర్పించారు. వీటిని జెలెన్‌స్కీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రష్యన్ దళాలు ఆక్రమించిన ఏ భూమిని ఉక్రెయిన్ వదులుకోవడానికి సిద్ధంగా లేదని జెలెన్‌స్కీ తేల్చిచెప్పారు. మొత్తానికి సౌదీ అరేబియా వేదికగా తాత్కాలిక కాల్పుల విరమణకు చర్చలు జరగనున్నాయి. ఈ చర్చల తర్వాత 30 రోజులు తాత్కాలిక కాల్పులకు విరమణ దొరకనుంది.

Tags

Next Story