Bird Flu: అమెరికాలో బర్డ్ ఫ్లూ కలకలం..

Bird Flu: అమెరికాలో బర్డ్ ఫ్లూ కలకలం..
X
మానవుడిలో తొలిసారిగా తీవ్రమైన బర్డ్ ఫ్లూ ఇన్ఫెక్షన్..

అమెరికా కాలిఫోర్నియాలో బర్డ్ ఫ్లూ (హెచ్5ఎన్1) కలకలం రేపుతోంది. 34 మంది ఈ వైరస్ బారిన పడడంతో రాష్ట్రంలో ఎమర్జెన్సీ విధిస్తూ గవర్నర్ గవిన్ న్యూసమ్ ఆదేశాలు జారీ చేశారు. వైరస్ వ్యాప్తిని అరికట్టే చర్యలు తీసుకుంటున్నట్టు గవర్నర్ తెలిపారు. దక్షిణ కాలిఫోర్నియాలోని ఓ డెయిరీ ఫాంలోని ఆవుల్లో ఈ వైరస్‌ను గుర్తించారు.

కోవిడ్-19 తర్వాత మరోసారి మహమ్మారి ప్రబలే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇది బర్డ్ ఫ్లూ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వైరస్ మహమ్మారిగా మారేందుకు అనువుగా మార్పులు చేసుకునే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

ఇదిలా ఉంటే, అమెరికా లూసియానాలో ఒక రోగికి ఎవియన్ ఇన్‌ఫ్లుఎంజా(బర్డ్ ఫ్లూ) యొక్క తీవ్రమైన ఇన్‌ఫెక్షన్‌ని గుర్తించారు. ఇది అమెరికాలో గుర్తించబడిని తొలి తీవ్రమైన కేసు అని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) బుధవారం ప్రకటించింది. ఈ కేసుతో 2024 నుంచి అమెరికాలో బర్డ్ ఫ్లూ సోకిన వారి సంఖ్య 61కి చేరింది. ప్రస్తుతం ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న రోగి, చనిపోయిన పక్షులతో దగ్గరగా ఉన్నాడని తేలింది. ఈ కేసు గత శుక్రవారం నిర్ధారించబడింది. ఇది బర్డ్ ఫ్లూ వైరస్ H5N1 వైరస్ D1.1 జన్యురూపానికి చెందినదని తేలింది.

ఈ జన్యురూపం ఇటీవల అమెరికాలోని అడవి పక్షలు, ఫౌల్ట్రీలలో కనుగొనబడింది. వాషింగ్టన్ రాష్ట్రంతో పాటు కెనడాలోని బ్రిటీష్ కొలంబియా ప్రావిన్సులో మానవ కేసుల్లో ఈ జన్యురూపాన్ని గుర్తించారు. అయితే, బర్డ్ ఫ్లూ మానవుడి నుంచి మానవుడికి వ్యాపించడాన్ని సూచించే తగిన ఆధారాలు లేవని ఆరోగ్య అధికారులు తెలిపారు.

Tags

Next Story