Antony Blinken: బోయింగ్ విమానంలో సాంకేతిక లోపం..

బోయింగ్ విమానాలను ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్టాత్మక విమానయాన సంస్థలు వినియోగిస్తున్నాయి. అయితే వాటిలో ఇటీవల వరుసగా తలెత్తుతున్న సాంకేతిక సమస్యలు ప్రయాణికులను భయపెడుతున్నాయి. బోయింగ్ 737 మ్యాక్స్ విమానాల్లో బోల్టులు లూజ్ అయిన ఘటన కలవరపెట్టింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆ విమానాల్లో సంస్థ తనిఖీలు ప్రారంభించి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తోంది. అంతలోనే ఇటీవల కొన్ని వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న బోయింగ్ విమానం డోర్ ఊడి కిందపడింది. జపాన్‌లోని ఆల్ నిప్పన్ ఎయిర్‌వేస్‌కు చెందిన బోయింగ్ విమానం కాక్‌పిట్ అద్దంపై పగుళ్ళు రావడంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. ఇక ఇప్పుడు తాజాగా, అమెరికా విదేశాంగమంత్రి ఆంటోనీ బ్లింకెన్ ప్రయాణించాల్సిన విమానంలో ఆక్సిజన్ లీకేజీ సమస్య కలవరపెట్టింది.
దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు హాజరైన ఆంటోనీ బ్లింకెన్ బుధవారం తిరిగి వాషింగ్టన్ చేరుకోవాల్సి ఉంది. అయితే, ఆయన ప్రయాణించాల్సిన బోయింగ్ 737 విమానంలో సాంకేతిక సమస్య ఏర్పడి ఆక్సిజన్ లీక్ అయింది. దీంతో స్విట్జర్లాండ్‌లోనే చిక్కుకుపోయారు. విషయం తెలిసిన అమెరికా ప్రభుత్వం వాయుసేన విమానాన్ని పంపి ఆయనను వెనక్కి తీసుకొచ్చింది.
ఫ్లైట్ 1182 టొయామా విమానాశ్రయానికి వెళుతుండగా కాక్పిట్ లో పగుళ్లు గమనించారు. కాక్‌పిట్ చుట్టూ ఉన్న నాలుగు కిటికీల వెలుపలి భాగంలో పగుళ్లు కనిపించాయని ఎయిర్‌లైన్ ప్రతినిధి తెలిపారు. పగుళ్లు కనిపించినప్పుడు విమానంలో 59 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. అయితే ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నట్లు పేర్కొన్నారు. అంతకు ముందు అలస్కా ఎయిర్ లైన్స్ చెందిన విమానం గాల్లో ఉండగా డోర్ ఊడిపోయింది. దీంతో ఆ విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఈ ఘటన తర్వాత బోయింగ్ 737 మ్యాక్స్ 9 విమానాలను అమెరికాకు చెందిన ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ తిరగనీయకుండా చేసింది. వీటిపై ఆంక్షలను మరింత కాలం పొడిగించింది. భారత్ లోని బోయింగ్ 737 మ్యాక్స్ 9 విమానాలు ఉన్నాయి. దేశంలో ఈ రకం విమానాలు మొత్తం 40 ఉన్నాయి. వీటిని ఆకాశ ఎయిర్ (22), స్పైస్ జెట్ (9), ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ (9) ఉన్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com