Trump: వెనిజులా చమురుపై ట్రంప్ చూపు..

వెనిజులాపై అమెరికా దాడి యావత్ ప్రపంచాన్ని షాక్‌కు గురిచేసింది. గత కొంత కాలంగా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతకు ఈ రోజు దాడులు నిదర్శనంగా నిలిచాయి. ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వెనిజులాను టార్గెట్ చేశారు. అమెరికాలోకి డ్రగ్స్ సరఫరాకు వెనిజులా పాత్ర ఉందని, డ్రగ్స్ సూత్రధారులతో మదురోకు సంబంధాలు ఉన్నాయని ట్రంప్ ఆరోపిస్తున్నారు. ఇదే కాకుండా అమెరికాలోకి వెనిజులా ఖైదీలను బలవంతంగా పంపిస్తోందని అన్నారు.
వెనెజువెలాపై ఆగ్రహం ఎందుకంటే...
హ్యూగో చావెజ్ 1999లో వెనెజువెలాలో అధికారంలోకి రాకముందు వరకూ ఆ దేశంలోని చమురు రంగంలో అమెరికా కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టాయి. వెనెజువెలా పాలకులు అమెరికా అనుకూల విధానాలను అనుసరించారు. వెనెజువెలా చమురు ఎగుమతులకు అగ్రరాజ్యం అతిపెద్ద విపణిగా ఉండేది. సామ్యవాద సిద్ధాంతంతో, పేదరిక నిర్మూలన నినాదంతో అధికారాన్ని చేజిక్కించుకున్న ఛావెజ్... దేశంలోని చమురు కంపెనీలన్నింటినీ జాతీయం చేశారు. దీంతో ఈ రంగంలో అమెరికా కంపెనీల పాత్ర పూర్తిగా తగ్గిపోయింది. అంతేకాకుండా ఛావెజ్... అమెరికా వ్యతిరేక దేశాలైన రష్యా, చైనా, ఇరాన్, క్యూబాలకు బాగా సన్నిహితమయ్యారు. చావెజ్‌ను పదవీచ్యుతుడిని చేయడానికి అమెరికా మద్దతుతో జరిగిన తిరుగుబాటు 2002లో విఫలమైంది. ప్రజల భారీ మద్దతుతో రెండు రోజుల్లోనే ఛావెజ్ తిరిగి అధికారాన్ని దక్కించుకున్నారు.
చావెజ్ బాటలో మదురో...
అనారోగ్యంతో 2013లో చావెజ్ మృతి చెందగా ఆయన స్థానంలో అధికారంలోకి వచ్చిన మదురో కూడా అమెరికా వ్యతిరేక విధానాలనే కొనసాగించారు. రష్యా, చైనా, ఇరాన్‌ల నుంచి ఆయుధాలు కొనుగోలు చేశారు. చావెజ్ అధికారంలో ఉన్నప్పుడు వెనెజువెలాపై మొదలైన ఆర్థిక ఆంక్షలను బరాక్ ఒబామా, జో బైడెన్, ట్రంప్ ప్రభుత్వాలు మరింత తీవ్రం చేశాయి. దీంతో దేశంలో తీవ్ర ద్రవ్యోల్బణం తలెత్తి నిత్యావసరాల ధరలు భారీగా పెరిగిపోయాయి. ప్రజల్లో అసంతృప్తి ప్రబలింది. అమెరికా అధ్యక్షులు జో బైడెన్ కానీ, డొనాల్డ్ ట్రంప్ కానీ వెనెజువెలా చట్టబద్ధమైన పాలకుడిగా మదురోను గుర్తించలేదు. ఎన్నికల సంస్కరణలు తీసుకురావాలన్న ఒత్తిళ్లకూ వెనెజువెలా అధ్యక్షుడు తలవంచలేదు. చావెజ్ మరణం తర్వాత అధ్యక్ష పదవిని చేపట్టిన మదురో... 2018, 2024 ఎన్నికల్లో విజయం సాధించినట్లుగా ప్రకటించుకోవడం వివాదాస్పదమైంది. అమెరికా సహా 50 దేశాలు వెనెజువెలా అధ్యక్షుడిగా ఆయనను గుర్తించటానికి నిరాకరించాయి.
అమెరికాకు ఎందుకంత ఆసక్తి...
వెనెజువెలాలో చమురు, బంగారం, సహజవాయువు నిల్వలు దండిగా ఉన్నాయి. ప్రపంచంలోనే భారీగా చమురు నిల్వలున్న దేశాల్లో ఇదొకటి. సుమారు 30,300 కోట్ల బ్యారెళ్ల చమురు నిల్వలున్నాయని అంచనా. సౌదీ అరేబియా చమురు నిల్వల కన్నా అధికం. వెనెజువెలా చమురు వనరులు అమెరికా చేతికి వస్తే పశ్చిమాసియా దేశాలపై ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుంది. చమురు విక్రయాలతో వస్తోన్న ఆదాయంతోనే తీవ్ర ఆంక్షలను సైతం వెనెజువెలా ఈ మాత్రంగా నైనా తట్టుకోగలగుతోంది. పైగా అమెరికా ఆధిపత్యాన్ని వెనెజువెలా పాలకులు తరచూ ప్రశ్నిస్తున్నారు. అమెరికా సైనిక దుస్సాహసానికి పాల్పడితే సమర్థంగా తిప్పికొట్టగలమని మదురో ఇటీవల ప్రకటించడంతో పాటు గత ఏడాది నవంబరు 12న దేశవ్యాప్తంగా సైనిక విన్యాసాలూ నిర్వహించారు.
ఇదిలా ఉంటే, చాలా మంది అంతర్జాతీయ నిపుణులు ట్రంప్ వెనిజులా చమురు, సహజ వనరులను కొల్లగొట్టేందుకు దాడులకు తెగబడినట్లు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలకు నిజం చేకూరుస్తూ.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫాక్స్ న్యూస్‌తో మాట్లాడిన ట్రంప్.. అమెరికన్ ఆయిల్ కంపెనీలు వెనిజులా చమురు పరిశ్రమల్లో చాలా కీలక పాత్ర పోషిస్తాయని శనివారం అన్నారు. మాకు ప్రపంచంలోనే అతిపెద్ద చమురు కంపెనీలు ఉన్నాయని, అవి వెనిజులా ఆయిల్ ఇండస్ట్రీలో పాల్గొంటాయని అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

