అంతర్జాతీయం

Modi US Tour : అమెరికా పర్యటనలో ప్రధాని మోదీ బిజీబీజీ...!

Modi US Tour : నాలుగు రోజుల అమెరికా పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ బిజీబిజీగా గడుపుతున్నారు. రెండోరోజూ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారీస్‌తో ప్రధాని తొలిసారి భేటీ అయ్యారు.

Modi US Tour : అమెరికా పర్యటనలో ప్రధాని మోదీ బిజీబీజీ...!
X

నాలుగు రోజుల అమెరికా పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ బిజీబిజీగా గడుపుతున్నారు. రెండోరోజూ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారీస్‌తో ప్రధాని తొలిసారి భేటీ అయ్యారు. భారత్‌లో కొవిడ్ సంక్షోభం గురించి జూన్‌లో మోదీతో మాట్లాడిన కమలా హారీస్.. నేరుగా కలవడం ఇదే తొలిసారి. ఇక.. మ్యూచువల్, గ్లోబల్ ఇంటరస్ట్ అంశాలపై జరిగిన చర్చల్లో ఇరువురు పాల్గొనగా.. ఇండియా – అమెరికా నేచురల్ పార్టనర్స్ అని మోదీ కొనియాడారు. భారత్, అమెరికాలు అతిపెద్ద, పురాతన ప్రజాస్వామ్య వ్యవస్థ కలిగి ఉన్నాయని, ఇరు దేశాల విలువలు, సహకారం క్రమంగా పెరుగుతూనే ఉందని మోదీ గుర్తుచేశారు.

ప్రధాని మోదీ, కమలా హారీస్ భేటీలో పలు అంశాలు చర్చకు వచ్చాయి. ఉగ్రవాద సమస్య గురించి ఆందోళన వ్యక్తం చేసిన కమలా హారీస్.. పాకిస్థాన్ పాత్రను స్వయంగా ప్రస్తావించారు. ఉగ్రవాద సంస్థలకు పాక్ మద్దతు ఇవ్వడం మానుకోవాలని హితవు పలికారు. భారత్, అమెరికా ద్వైపాక్షిక సంబంధాలు ప్రెసిడెంట్ జో బైడెన్‌ సమక్షంలో మరోస్థాయికి చేరుతాయని ఆకాంక్షించారు. అంతేకాదు.. ప్రపంచంలో చాలా మందికి రెండు దేశాల సంబంధాలు ఆదర్శంగా ఉంటాయని కమలా హారీస్ కొనియాడారు.

ప్రధాని మోదీతో సమావేశం కావడంపై కమలా హారీస్ ఆనందం వ్యక్తం చేశారు. తొలిసారి భేటీ సందర్భంగా కమలా హారీస్‌కు మోదీ ప్రత్యేకమైన కానుకలు ఇచ్చారు. కమల హారీస్ తాత పీవీ గోపాలన్‌కు సంబంధించిన పాత నోటిఫికేషన్‌ల ప్రతిని హస్తకళతో చేసిన చెక్క ఫ్రేమ్‌లో బహుకరించారు. దీంతో పాటు కాశీలో తయారు చేయించిన ఉడెన్‌ ఫ్రేమ్‌తో పాటు గులాబీ మీనాకరీ చెస్‌ సెట్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారు మోదీ.

ఈ సందర్భంగా భారత్‌లో ప్రభుత్వాధికారిగా గోపాలన్ వివిధ హోదాల్లో పనిచేసిన విషయాన్ని కమలా హారీస్‌కు గుర్తుచేసిన ప్రధాని మోదీ.. ఇండియాకు ఆహ్వానించారు. మరోవైపు క్వాడ్ కూటమి దేశాధినేతలకు కానుకలు అందించారు. ఆస్త్రేలియా ప్రధాని మోరిసన్‌కు కాశీలో తయారు చేయించిన సిల్వర్ గులాబీ మీనాకరీ పడవ, జపాన్‌ ప్రధాని యోషిండె సుగకు గంధపు చెక్కతో చేసిన బుద్ధుని విగ్రహాన్ని కానుకగా ఇచ్చారు మోదీ.

Next Story

RELATED STORIES