USA : చిక్కుల్లో డొనాల్డ్ ట్రంప్

USA : చిక్కుల్లో డొనాల్డ్ ట్రంప్
X

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరిన్ని చిక్కుల్లో పడ్డారు. రిపబ్లికన్‌ తరఫున మరోసారి వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న ట్రంప్‌నకు.. భారీ షాక్‌ తగిలింది. పోర్న్ స్టార్.. స్టార్మీ డేనియల్స్‌కు చెల్లింపుల కేసులో ట్రంప్‌పై ఆదేశ స్థానిక కోర్టు నేరాభియోగాలు మోపింది. క్రిమినల్ అభియోగాలకు మాన్‌హట్టన్ గ్రాండ్ జ్యూరీ ఆమోదం తెలిపింది. దీంతో అమెరికా అధ్యక్ష చరిత్రలో నేర అభియోగాలు ఎదుర్కొంటున్న తొలి మాజీ అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ అపఖ్యాతి మూటగట్టుకున్నారు. మరోవైపు పోర్న్‌స్టార్ ఇచ్చిన షాక్‌తో ట్రంప్ అరెస్ట్ ఖాయమని అమెరికాలోని విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు ఈ నేరారోపణలపై కోర్టులో లొంగిపోయే విషయంలో ట్రంప్‌ తన లాయర్లతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.

అటు తనపై వచ్చిన ఆరోపణలను డొనాల్డ్​ ట్రంప్​తీవ్రంగా ఖండించారు. తనను కొందరు రాజకీయ నాయకులు కావాలనే ఇరికిస్తున్నారని ఆరోపించారు. ఈ పాపం బైడెన్‌ను వెంటాడుతుందని.. త్వరలోనే అతనికి భారీ ఎదురుదెబ్బ తగులుతుందన్నారు. మరోవైపు ట్రంప్‌పై నేరారోపణలను విపక్షాలు తప్పుబట్టాయి. రిపబ్లికన్‌ పార్టీ తీవ్రంగా ఖండించింది. ట్రంప్‌పై క్రిమినల్ కేసులో అభియోగాల నమోదు కక్ష సాధింపే అని విమర్శించింది. దేశ చరిత్రలో ఇదొక చీకటి రోజని రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి స్థానానికి పోటీ పడుతున్న నిక్కీ హేలీ, వివేక్ రామస్వామి విమర్శించారు. డెమోక్రటిక్‌ పార్టీ మాత్రం స్వాగతించింది. ఇది చరిత్రలో అత్యున్నత స్థాయిలో రాజకీయ ప్రక్షాళన అభిప్రాయపడింది. చట్టానికి ఎవరూ అతీతులు కాదని ఈ ఘటనతో రుజువైందని డెమోక్రటిక్‌ పార్టీ తెలిపింది. మరి ట్రంప్‌ను అరెస్ట్‌ చేస్తారా.. లేక కోర్టులో ఆయనే లొంగిపోతారా..? కేవలం కోర్టు విచారణతో సరిపెడతారా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

Next Story