అమెరికా ఎన్నికల ఫలితాలు.. కీలకంగా మారిన జార్జియా.. ఒకవేళ బైడెన్‌ అక్కడ ఓడిపోతే..

అమెరికా ఎన్నికల ఫలితాలు.. కీలకంగా మారిన  జార్జియా.. ఒకవేళ బైడెన్‌ అక్కడ ఓడిపోతే..

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. 5 రాష్ట్రాల్లో లెక్కింపు కొనసాగుతూనే ఉంది. ఇందులో జార్జియా కీలకంగా మారింది. ఇక్కడ ట్రంప్‌, బైడెన్‌ మధ్య పెద్దగా అంతరం లేకపోవడంతో పోరు రసవత్తరంగా మారింది. జార్జియాలో ట్రంప్‌ ఆధిక్యంలో ఉండగా.. బైడెన్‌ దూసుకొస్తున్నారు. తొలుత ట్రంప్‌ ఆధిక్యం కనబర్చినప్పటికీ క్రమంగా అది తగ్గుతూ వచ్చింది. ఇప్పుడు ట్రంప్‌ను దాటి బైడెన్‌ ముందంజలో ఉన్నారు. ప్రస్తుతం జోబైడెన్‌ 917 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. జోబైడెన్‌కు 24 లక్షల 49 వేల 371 ఓట్లు రాగా...ట్రంప్‌కు 24 లక్షల 48వేల 454 ఓట్లు వచ్చాయి. వీరిద్దరి మధ్య తేడా 0. 02 శాతమే. జార్జియాలో ఇప్పటి వరకు 99 శాతం కౌంటింగ్‌ పూర్తైంది.

ఈ రాష్ట్రంలో 16 ఎలక్టోరల్‌ ఓట్లు ఉన్నాయి. బైడెన్‌ గెలిస్తే ఈ ఓట్లన్నీ ఆయనకే పడతాయి. ట్రంప్‌ జార్జియాలో ఓడిపోయి మిగతా నాలుగింటిలో గెలిచినా మ్యాజిక్‌ ఫిగర్‌ను అందుకోలేరు. ఇక ఫలితం తేలని మిగిలిన 4 రాష్ట్రాల్లో 3 చోట్ల ట్రంప్‌ ఆధిక్యంలో ఉన్నారు. పెన్సిల్వేనియా, అలస్కా, నార్త్‌ కరోలినాలో ట్రంప్ ముందంజలో ఉండగా.. నెవడాలో బైడెన్‌ దూసుకెళ్తున్నారు. జార్జియా, నెవాడా డెమొక్రాట్ల వశమైతే బైడెన్‌ గెలుపు ఖాయంగా కనిపిస్తోంది..

ఒకవేళ జార్జియాలో బైడెన్‌ గెలిస్తే సెనెట్‌లో డెమొక్రాట్ల బలం పెరుగుతుంది. అప్పుడు చట్టాలు ఆమోదించడానికి, కీలక నియామకాలు చేపట్టడానికి డెమొక్రాటిక్‌ పార్టీకి ఎలాంటి అడ్డంకులు ఉండవు. ఒకవేళ జార్జియాలో ఓడిపోయి.. బైడెన్‌ అధ్యక్షుడైతే మాత్రం సెనెట్‌లో ఇబ్బందులు తప్పవంటున్నారు విశ్లేషకులు. మరోవైపు జార్జియాలో రీకౌంటింగ్‌ దిశగా వెళ్లే అవకాశాలు కన్పిస్తున్నాయి. నిబంధనల ప్రకారం.. గెలుపు మార్జిన్‌ 0.5శాతం, అంతకంటే తక్కువ ఉన్నప్పుడు ఓడిన అభ్యర్థి రీకౌంటింగ్‌ కోరే అవకాశం ఉంది. అయితే ఫలితాలు వెలువడిన రెండ్రోజుల్లోపే అభ్యర్థి రీకౌంటింగ్‌కు అభ్యర్థించాలి. ఒకవేళ తాజా ఫలితాల్లో ట్రంప్ ఓడిపోతే ఆయనకు రీకౌంటింగ్‌ కోరే హక్కు ఉంటుంది.

Tags

Read MoreRead Less
Next Story