భారతీయ అమెరికన్లకు గుడ్‌న్యూస్

భారతీయ అమెరికన్లకు గుడ్‌న్యూస్. రెండు కీలక బిల్లులకు అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది.సరైన పత్రాలు లేకుండా తమ దేశానికి వచ్చిన వారు, చట్టబద్ధంగా వలస వచ్చిన వారి సంతానం సహా లక్షలాది మంది భారతీయ వలసదారుల పౌరసత్వానికి వీలుకల్పించే ఈ రెండు కీలక బిల్లులకు 228-197 ఓట్ల తేడాతో ఆమోదం లభించింది. తాత్కాలిక రక్షణ హోదా కలిగిన వారు, డ్రీమర్లకు అమెరికా పౌరసత్వం కల్పించేందుకు ఈ బిల్లుల ద్వారా వీలుకలుగనుంది. చిన్నారులుగా ఉన్న సమయంలో తల్లిదండ్రులతో కలిసి అమెరికాకు వలస వచ్చి ప్రస్తుతం యువతగా మారిన వారిని డ్రీమర్లుగా పరిగణిస్తుంటారు. అలాంటివారిలో 5 లక్షల మంది భారతీయులు సహా మొత్తం కోటి పదిలక్షల మంది ఉన్నారు.
హెచ్1బి వీసా ద్వారా వచ్చినవారి సంతానానికి పౌరసత్వం కల్పించేందుకు కూడా ఈ బిల్లుల ద్వారా వీలు కలగనుంది. ప్రతినిధుల సభలో ఆమోదం పొందిన ఈ బిల్లులు సెనేట్ ఆమోదానికి పంపనున్నారు. అధ్యక్షుడు జో బైడెన్ సంతకం తర్వాత ఇవి చట్టాలుగా మారనున్నాయి. దేశ వలస విధానాన్ని సంస్కరించడంలో ఈ బిల్లులు మొదటి అడుగు అని జో బైడెన్ వ్యాఖ్యానించారు. 2021 జనవరి 21 ముందు సరైన ధ్రువపత్రాలు లేకుండా అమెరికాలోకి ప్రవేశించిన 18ఏళ్లలోపు యువతకు ఆ దేశ పౌరసత్వం ఇచ్చేందుకు మార్గం సుగమం చేయాలని బైడెన్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలోనే 'ది అమెరికన్ డ్రీమ్ అండ్ ప్రామిస్' అనే పేరుతో ప్రతినిధుల సభలో బిల్లును ప్రవేశపెట్టింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com