Ram Mandir : రామ్‌లల్లాను దర్శించుకున్న సీఎం యోగి

Ram Mandir : రామ్‌లల్లాను దర్శించుకున్న సీఎం యోగి
యూపీ మంత్రులు, ఎమ్మెల్యేలు

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర మంత్రులు, బీజేపీ, ఇతర పార్టీల ఎమ్మెల్యేలందరూ సీఎం యోగి ఆధిత్యనాథ్ తో పాటు ప్రత్యేక బస్సుల ద్వారా అయోధ్యకు వెళ్లారు. అయోధ్య రామాలయాన్ని సందర్శించి రామ్ లల్లాను దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి ఆధిత్యనాథ్ పూణె నుండి అయోధ్యకు విమానంలో చేరుకున్నారు. వీరితోపాటు అసెంబ్లీ స్పీకర్ సతీష్ మహానా, ఆర్ఎల్డీ, బీఎస్పీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా ప్రత్యేక బస్సుల్లో తరలివచ్చి రామ్ లల్లాను దర్శించుకున్నారు. యూపీ ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రత్యేక బస్సుల్లో బయలుదేరారు. కాన్వాయ్ ఉదయం 9గంటలకు లక్నో నుంచి బయలుదేరి.. ఉదయం 11.30 గంటలకు అయోధ్యకు చేరుకుంది. అనంతరం రామ మందిరాన్ని సందర్శించారు. ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాథ్ తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు రామ్ లల్లాను దర్శించుకొని ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు.

ఆలయంలో పూజలు నిర్వహించామంటూ మందిరం మెట్ల వద్ద దిగిన ఫోటోలను సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ట్విట్టర్‌లో షేర్ చేశారు. యూపీ స్పీకర్ సతీశ్ మహానా సైతం ట్విట్టర్‌లో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ‘నేను చాలా ఉద్వేగానికి లోనయ్యాను ఎందుకంటే నేను ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు, ఇక్కడ ఒక నిర్మాణం నిలబడి ఉంది.. అది డిసెంబర్ 6 న మా ముందు విరిగిపోయింది. 1990లో తూటాలు పేలినప్పుడు నేను ఇక్కడకు వెళ్లాను.. వేదిక నిర్మాణం సమయంలోనూ వచ్చాను.. ఈరోజు, దైవ సన్నిధిని ప్రత్యక్షంగా చూసే భాగ్యం నాకు లభించింది’ అని పోస్ట్ పెట్టారు.


ఇదిలా ఉండగా, అయోధ్య ఆలయ సందర్శనకు స్పీకర్ పంపిన ఆహ్వాన్ని ప్రధాన ప్రతిపక్షం సమాజ్‌వాదీ పార్టీ తిరస్కరించింది. ‘జనవరి 22న జరిగిన రామమందిర ప్రాణప్రతిష్ఠకు మమ్మల్ని ఆహ్వానించలేదు.. ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యేతో కలిసి వెళ్లే ప్రసక్తే లేదు... అప్పుడు స్పీకర్ కూడా మమ్మల్ని రమ్మని చెప్పలేదు.. ఎస్పీ ఎమ్మెల్యేలు అయోధ్య వెళ్లేందుకు ఏర్పాట్లు చేయాలని మా నాయకుడు అఖిలేశ్ యాదవ్‌ను కోరుతాం’ అని ఎస్పీ జనరల్ సెక్రటరీ, ఎమ్మెల్యే శివపాల్ సింగ్ యాదవ్ అన్నారు. మరోవైపు, అయోధ్య రామమందిర దర్శనానికి దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. రోజుకు లక్షల్లో భక్తులు దర్శనం చేసుకుంటున్నారు.

అయోధ్యకు చేరుకోగానే మంత్రులు, ఎమ్మెల్యేలకు ఘన స్వాగతం లభించింది. అంతకుముందు దారిపొడవునా స్థానిక ప్రజలు బస్సులపై పూల వర్షం కురిపించి జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. బుల్డోజర్లు ఎక్కి మరీ ప్రజాప్రతినిధులు వెళ్తున్న బస్సులపై ప్రజలు పూల వర్షం కురిపించించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే, ఈ బృందంలో సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, వారి బృందం పాల్గొనలేదు.

Tags

Read MoreRead Less
Next Story