Home
 / 
అంతర్జాతీయం / అమెరికా...

అమెరికా ఉపాధ్యక్షురాలినైనా.. అమ్మకి కూతురినే : కమలా హ్యారిస్

కమల తల్లి శ్యామల తన ప్రత్యేకమైన యాస, రంగు వల్ల కెరీర్‌లో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

అమెరికా ఉపాధ్యక్షురాలినైనా.. అమ్మకి కూతురినే : కమలా హ్యారిస్
X

బడిలో మాస్టారు చెప్పిన పాఠాలకంటే ముందు అమ్మ ఒడిలో నేర్చుకున్న పాఠాలే అమెరికా ఉపాధ్యక్షురాలిని చేశాయి అని వినమ్రంగా చెబుతారు కమలా హ్యారిస్. కమల తల్లిదండ్రులిద్దరూ బర్కెలీ యూనివర్శిటీ విద్యార్థులు. తల్లి శ్యామలా గోపాలన్ క్యాన్సర్ పరిశోధకురాలు కాగా, తండ్రి డొనాల్డ్ హ్యారిస్ ఆర్థిక శాస్త్రంలో ప్రొఫెసర్. పౌరహక్కుల ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్న తల్లిదండ్రులతో కలిసి చిన్ననాటే అడుగులు కలిపింది కమల. మన కోసం మనం కాదు.. ఇతరుల కోసం పని చేయడంలోనే ఆనందం ఉంటుంది.. జీవితానికో అర్థం ఉంటుంది అని అమ్మ చెప్పిన మాటలు కమల మనసులో నాటుకుపోయాయి.. ఆ దిశగానే తన జీవనాన్ని కొనసాగించాలని అప్పుడే బలంగా నిర్ణయించుకున్నారు కమల.

ఏడేళ్లకే ముగిసిపోయిన బంధం..

దిల్లీలో చదువుకున్న శ్యామల.. తండ్రి గోపాలన్ పంచిన పోరాట స్ఫూర్తితో పై చదువుల కోసం పంథొమ్మిదేళ్ల వయసులో అమెరికాలో అడుగుపెట్టారు. అక్కడే తన భావాలకు దగ్గరగా ఉన్న హ్యారిస్‌తో పరిచయం ప్రేమగా మారింది. పెళ్లికి దారి తీసింది.. అయితే వారి వివాహ బంధం ఏడేళ్లకే ముగిసిపోయింది.. ఈలోపే ఇద్దరు ఆడపిల్లలకి తల్లైంది శ్యామల. కోర్టులో డబ్బు కోసం కాకుండా పుస్తకాల కోసం వారిద్దరూ గొడవపడ్డారట.. భారతీయ మూలాలు ఉన్న అమ్మ మమ్మల్ని ఓ సాధారణ గృహిణిలానే పెంచింది. తమిళనాడులోని తన పుట్టింటికి తీసుకువెళ్లి నాకు , చెల్లికి మామయ్య, అత్తయ్య, పిన్నీ అంటూ అందరినీ పరిచయం చేసింది. కమల తల్లి శ్యామల తన ప్రత్యేకమైన యాస, రంగు వల్ల కెరీర్‌లో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. క్యాన్సర్‌పై పరిశోధనలు చేస్తున్న శ్యామల అదే క్యాన్సర్‌కి గురై 2009లో కన్నుమూశారు.

కమల విజయంలో చెల్లెలు మాయ కీలక పాత్ర

కమల ఉపాధ్యక్ష పదవికి పోటీపడుతోందని తెలియగానే ఆమె ప్రచార బృందంలో చేరి చురుకైన పాత్ర పోషించారు చెల్లెలు మాయలక్ష్మి. మాయ.. లాయర్, పౌర హక్కుల ఉద్యమకారిణి, రచయిత కూడా. అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్ నాయకురాలిగా, ఫోర్డ్ ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న మాయకు మనుమలు కూడా ఉన్నారు. కమలకు తీరిక దొరికినప్పుడల్లా వెళ్లి వారితో సరదాగా గడుపుతుంటారు.చదువు..

తల్లి కెనడాలోని మెక్‌గిల్ యూనివర్శిటీలో కొన్నాళ్లు పరిశోధకురాలిగా, బోధకురాలిగా పనిచేయడంతో కమల స్కూలింగ్ అక్కడే చేశారు. హార్వర్డ్‌లో ఎకనమిక్స్, పొలిటికల్ సైన్స్‌లో అండర్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. ఆపైన బర్కెలీ నుంచి లా చేశారు. తర్వాత ఓక్లాండ్‌లో ప్రాసిక్యూటర్‌గా కెరీర్ ప్రారంభించారు.

2004లో శాన్‌ఫ్రాన్సిస్కో డిస్ట్రిక్ట్ అటార్నీగా బాధ్యతలు తీసుకున్నారు. ఈ హోదాకు చేరుకున్న మొట్ట మొదటి నల్ల జాతి మహిళ కమల.

2011లో కాలిఫోర్నియా రాష్ట్రానికి మొట్టమొదటి మహిళా అటార్నీ జనరల్‌గా, అదే రాష్ట్రం నుంచి 2016లో సెనేట్‌కు ఎంపికయ్యారు.

2014లో న్యాయవాది డగ్లస్ ఎంహాఫ్‌ను పెళ్లి చేసుకున్నారు కమల. డగ్‌కు అప్పటికే పైళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారు. వాళ్లు కమలను సవతి తల్లిగా పిలవడానికి ఇష్టపడలేదు. అందుకే మామల అని పిలుస్తారు. మామ్, కమల పదాల కలయికతో మామల అని పిలవడాన్ని వారెంతో ఇష్టపడతారు. ఎంత బిజిగా ఉన్నప్పటికీ మా కోసం కొంత సమయాన్ని కేటాయిస్తారు అని మామల గురించి ఇష్టంగా చెబుతారు వారిద్దరు. డగ్స్ మొదటి భార్యతో కూడా కమలకు మంచి సంబంధాలే ఉన్నాయి.

మహిళల గురించి చెబుతూ..

మీకు నాయకత్వం చేపట్టాలని ఉంటే ఎన్ని అవాంతరాలు ఎదురైనా వాటిని సమర్ధవంతంగా ఎదుర్కోండి.. బలంగా తయారుకండి.. మీ మనసు మాట వినండి.. అని కమల మహిళల్లో స్ఫూర్తి నింపుతారు.

Next Story