Sheikh Hasina: బంగ్లాదేశ్‌లో హింస నియంత్రించే శక్తి యూనస్ ప్రభుత్వానికి లేదు : షేక్ హసీనా

మన పొరుగు దేశం బంగ్లాదేశ్ మరోసారి భగ్గుమంది. ఇటీవల కాల్పుల్లో గాయపడి చికిత్స పొందుతున్న విద్యార్థి, తిరుగుబాటు నాయకుడు, భారత్ వ్యతిరేక వ్యాఖ్యలు చేసే షరీఫ్ ఉస్మాన్ హాది (32) మరణించడంతో ఆ దేశంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిరసనకారులు గురు, శుక్రవారాల్లో దేశంలో పలుచోట్ల నిరసనలు చేపట్టడంతో హింస, విధ్వంసం చోటు చేసుకుంది.
అల్లర్లలో ఒక హిందువు హత్యకు గురి కాగా, పలువురు నిరసనకారులు, పౌరులు గాయపడ్డారు. ప్రస్తుతం ఆ దేశంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజా ఉద్రిక్తతలపై ఆదేశ మాజీ ప్రధాని షేక్ హసీనా తాజాగా స్పందించారు. ఈ మేరకు యూనస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. బంగ్లాదేశ్‌లో హింస అనేది సాధారణ విషయంగా మారిందని.. దేశంలో హింసను నియంత్రించడంలో తాత్కాలిక ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు.
ఓ వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హసీనా మాట్లాడుతూ. ‘ఉస్మాన్ బిన్ హాదీ హత్య అనంతరం ఢాకాలో నెలకొన్న హింస దేశాన్ని మరితం అస్థిరపరుస్తోంది. ఈ హత్య నా ప్రభుత్వాన్ని కూల్చివేసి, యూనస్ పాలనలో పెరిగిపోయిన అక్రమాన్ని ప్రతిబింబిస్తోంది. నన్ను బహిష్కరించినప్పటి నుంచి దేశంలో పరిస్థితి మరింత దిగజారింది. యూనస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బంగ్లాలో హింస పెరిగిపోయింది. హింసను ఆపడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. నిరంతర హింస బంగ్లాదేశ్‌ను అంతర్గతంగా అస్థిరపరుస్తోంది.
పొరుగు దేశాలతో, ముఖ్యంగా భారతదేశంతో సంబంధాలను దెబ్బతీస్తోంది. ఈ గందరగోళాన్ని, మైనారిటీలపై జరుగుతున్న వేధింపులను, మనం కలిసి నిర్మించిన వ్యవస్థల క్షీణతను భారత్చూస్తోంది’ అని హసీనా వ్యాఖ్యానించారు. యూనస్ ప్రభుత్వం ఇస్లామిక్ తీవ్రవాద శక్తులకు అవకాశం కల్పిస్తోందని షేక్ హసీనా తీవ్ర ఆరోపణలు చేశారు. తీవ్రవాదులను కేబినెట్‌లో చేర్చుకోవడం, జైళ్లలో ఉన్న ఉగ్రవాదులను విడుదల చేయడం వంటి చర్యలను ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. యూనస్‌కు పాలనా అనుభవం లేదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

