Vladimir Putin: ఒక్కొక్కరు 8 మంది పిల్లల్ని కనండి..
రష్యాలో మరణాల సంఖ్య కంటే జననాల సంఖ్య నానాటికీ పడిపోతోంది. రష్యన్లు విదేశాలకు వలస వెళ్తున్నారు. దీంతో ఇటీవలే కాలంలో రష్యా అధికారులు ప్రజలను అధిక సంతానాన్ని కనే దిశగా ప్రోత్సహిస్తున్నారు. ప్రసవాలను పెంచేందుకు వివిధ కార్యక్రమాలను కూడా చేపడుతున్నారు. అయినప్పటికీ ఆ దేశంలో మరణాల రేటు కంటే జననాల రేటు చాలా తక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో దేశ జనాభాను పెంచేందుకు అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక ప్రకటన చేశారు. దేశంలోని మహిళలు ఎనిమిది అంతే కంటే ఎక్కువ మంది పిల్లల్ని కనాలని విజ్ఞప్తి చేశారు.
జనాభా తగ్గుదలను అరికట్టడానికి ఎక్కువమంది పిల్లలను కలిగి ఉండాలని పౌరులను కోరారు పుతిన్. మాస్కోలో జరిగిన ప్రపంచ రష్యన్ పీపుల్స్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న పుతిన్ అనేక అంశాలపై ప్రసంగించారు. రష్యన్ కుటుంబాలలో మన అమ్మమ్మలు, ముత్తాతలకు 7 నుండి 8 మంది పిల్లలు ఉన్నారనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని.. పెద్ద కుటుంబం కలిగి ఉండటం రష్యాలో ప్రజలందరికీ ఒక కట్టుబాటుగా, జీవన విధానంగా మారాలన్నారాయన. కుటుంబ సంప్రదాయాలను కాపాడుకోవడం నైతిక బాధ్యత అన్నారు పుతిన్.
రష్యాలో జననాల రేటు 1990 నుంచి దారుణంగా పడిపోతోందని.. గత సంవత్సరం ఫిబ్రవరిలో ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి దేశం 3,00,000 కంటే ఎక్కువ మంది మరణించినట్లు ది ఇండిపెండెంట్ నివేదించింది. ఆర్ధిక పరిస్థితులు, అనేక సంఘర్షణల నేపథ్యంలో రష్యాలో చాలామంది పిల్లల్ని కనకూడదని లేదంటే తాము మానసికంగా లేదా ఆర్ధికంగా స్థిరపడేవరకు వాయిదా వేయాలని నిర్ణయించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో దేశంలో జనాభా పెరుగుదలకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పిల్లలను కనడం విషయంలో దేశంలోని మహిళల్ని పోత్సహిస్తున్నారు. నేటి కాలం మహిళలు పిల్లలను కనడం కంటే చదువు, కెరీర్‌పైనే ఎక్కువగా శ్రద్ధ పెడుతున్నారని ఇటీవలే రష్యా ఆరోగ్య శాఖ మంత్రి మిఖాయిల్ మురాష్కో వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. మహిళలు చదువుకోవాలి, ఉన్నతోద్యోగం సాధించాలి. ఆర్థికంగా నిలదొక్కుకున్న తర్వాతే పెళ్లి, పిల్లల గురించి ఆలోచిస్తున్నారని అన్నారు. ఈ పద్ధతి సరికాదని వ్యాఖ్యానించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com