Indonesia: ఇండోనేషియాలో బద్ధలైన మరో అగ్నిపర్వతం

Indonesia:  ఇండోనేషియాలో బద్ధలైన మరో అగ్నిపర్వతం
X
సెగలు కక్కుతూ బయటకు వచ్చిన లావా

ఇండోనేషియా లో మరో అగ్నిపర్వతం బద్ధలైంది. శనివారం మధ్యాహ్నం తూర్పు ఇండోనేషియాలో మౌంట్ ఇబూ అగ్నిపర్వతం బద్ధలు కావడంతో సెగలు కక్కుతూ లావా విరజిమ్మింది. ఈ లావాతో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ఈ పొగలు అగ్నిపర్వతం పరిసరాల్లో చుట్టూ నాలుగు కిలోమీటర్ల పరిధిలో వ్యాపించాయి. ఉత్తర మలూకూ ప్రావిన్స్‌లోని హల్మెహరా ఐలాండ్‌లో ఈ అగ్నిపర్వతం ఉన్నది.

అగ్నిపర్వతం బద్ధలైన ప్రదేశం నుంచి దాదాపు 2 కిలోమీటర్ల వరకు ఈ లావా విస్తరించిందని అధికారులు తెలిపారు. అగ్నిపర్వతంపై కింద ఎర్రటి లావా, ఆపైన నల్లటి దట్టమైన పొగలు వ్యాపించి ఉన్నాయని పేర్కొన్నారు. అగ్నిపర్వతానికి 5.5 కిలోమీటర్ల కంటే లోపల ఉన్న నివాసితులు, పర్యాటకులు ఆ ప్రదేశాలను ఖాళీ చేసి వెళ్లిపోవాలని అధికారులు హెచ్చరికలు జారీచేశారు.

అగ్నిపర్వతం నుంచి వెల్లడైన బూడిద వర్షంలా కిందకు వచ్చే ప్రమాదం ఉందని, కాబట్టి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ముకానికి మాస్క్‌, కళ్లకు అద్దాలు ధరించాలని అధికారులు సూచించారు. మౌంట్‌ ఇబూ ఇండోనేషియాలో అత్యంత యాక్టివ్‌ అగ్నిపర్వతాల్లో ఒకటని చెప్పారు. గత ఏడాది ఆ అగ్నిపర్వతం ఏకంగా 2 వేల సార్లు బద్ధలైందని అన్నారు. 2022 లెక్కల ప్రకారం హల్మెహరా దీవిలో 7 లక్షల మంది ఉంటున్నారని తెలిపారు.

Tags

Next Story