Iceland Volcano: ఐస్‌ల్యాండ్‌లో మరోసారి బద్దలైన అగ్ని పర్వతం..

Iceland Volcano: ఐస్‌ల్యాండ్‌లో మరోసారి బద్దలైన అగ్ని పర్వతం..
X
జనావాసాలపైకి లావా..

ఐస్‌ల్యాండ్‌లో మరోసారి బద్దలైన అగ్ని పర్వతం.మళ్లీ బద్దలైంది. గ్రిండావిక్ పట్టణం సమీపంలో పేలిన అగ్నిపర్వతం నుంచి లావా వెలువడి ఇళ్లను బూడిద చేస్తోంది. అగ్నిపర్వతం పేలుడుకు ముందు భూప్రకంపనలు రావడంతో.. అధికారులు పట్టణాన్ని ఖాళీ చేయించడం వల్ల పెద్ద ముప్పు తప్పింది. లావా చుట్టుముట్టడంతో గ్రిండావిక్ ప్రజలు నిరాశ్రయులయ్యారు ప్రభుత్వం సహాయ చర్యలు చేపట్టి వారి కోసం ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తోంది.

నెలలోనే రెండోసారి ఐస్‌ల్యాండ్‌లో ఆగ్నిపర్వతం బద్దలై.. స్థానికులను కలవరపెడుతోంది. రెక్జానెస్‌ ద్వీపకల్పంలో ఆదివారం బద్దలైన అగ్నిపర్వతం నుంచి వెలువడిన లావా అక్కడి జనావాసాలను చుట్టుముడుతోంది. లావా చేరడంతో గ్రిండావిక్‌ ప్రాంతంలో కొన్ని ఇళ్లు కాలిబూడిదయ్యాయి. స్వల్ప భూప్రంకపనలతో అధికారులు గ్రిండావిక్‌ పట్టణాన్ని ఖాళీ చేయించారు. తర్వాత గంటల్లోనే ఆ పట్టణానికి సమీపంలో అగ్నిపర్వతం బద్దలై లావా ఇళ్లవైపుగా ప్రవహిస్తోంది. డిసెంబరులో అగ్నిపర్వతం తొలిసారి బద్దలైనప్పుడు గ్రిండావిక్ పట్టణానికి ఉత్తర దిశగా లావా ప్రవాహాన్ని అడ్డుకునేందుకు రాతితో అడ్డుకట్ట నిర్మించినట్లు అధికారులు తెలిపారు. అయితే తాజాగా అగ్నిపర్వతం బద్దలైనప్పుడు కొంత పేలుడు అడ్డుకట్ట లోపల జరిగిందని వివరించారు. అయితే లావా ప్రధాన ప్రవాహం కట్టడం అవతలవైపే ఉందని చెబుతున్నారు. తాజా లావా ప్రవాహానికి మరో అడ్డుకట్ట వేయడమా లేక మళ్లించి చల్లబడేలా చేయడమా అనే ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నారు.


లావా ఇళ్లను బూడిదచేయడం గ్రిండావిక్‌కు చీకటి దినమని ఐస్‌ల్యాండ్‌ ప్రధాని కాట్రిన్‌ జాకోబ్స్‌డోట్టిర్‌ వ్యాఖ్యానించారు. గ్రిండావిక్ ప్రజలకు పూర్తి సాయం అందిస్తామని.. ఆమె చెప్పారు. లావాతో నిరాశ్రయులైన ప్రజలకు జీతాలు, నష్టపోయిన ఇళ్లకు పరిహారం ఇస్తామని తెలిపారు. గ్రిండావిక్ ప్రజలు.... ఇళ్లు నిర్మించుకునేందుకు సహాయం చేస్తామని చెప్పారు. అయితే ఐస్‌ల్యాండ్‌ రాజధాని రెక్జావిక్ ప్రాంతంలో గ్రిండావిక్ ప్రజల కోసం ఇళ్లను కనుగొనడం చాలా కష్టంగా ఉందని ప్రధాని వివరించారు. గ్రిండావిక్‌ పట్టణజనాభా 3 వేల 800. రాజధాని రెక్జావిక్‌కు అది 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఐస్‌ల్యాండ్ రాజధాని ప్రాంతం ఉత్తర అట్లాంటిక్ అగ్నిపర్వత ప్రాంతానికి ఎగువన ఉంటుంది. అక్కడ నాలుగు నుంచి ఐదేళ్లకోసారి అగ్నిపర్వతం బ్రద్దలవుతూ ఉంటుంది.

తాజాగా అగ్నిపర్వతం బ్రద్దలైన నేపథ్యంలో గ్రిండావిక్ ప్రజలు ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. వీరితో పాటు పెంపుడు జంతువులు, పశువులను కూడా తీసుకెళ్తున్నారు. ఇప్పటివరకూ ఎలాంటి ప్రాణనష్టం నమోదు కాలేదు. ఐస్‌ల్యాండ్‌లో పర్యాటక ప్రాంతమైన బ్లూలాగూన్‌ను జనవరి 16 వరకు మూసివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

Tags

Next Story