వాగ్నర్ వెన్నుపోటు పొడిచాడు: పుతిన్

రష్యా సైన్యంపై వాగ్నర్‌ గ్రూప్ తిరుగుబావుటా...రెండు నగరాలు స్వాధీనం చేసుకున్న వాగ్నర్‌ గ్రూప్‌... వెన్నుపోటు పొడిచారని పుతిన్‌ ఆవేదన... కఠినంగా శిక్షిస్తామని హెచ్చరిక..

ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యాకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. అధ్యక్షుడు పుతిన్ ప్రైవేటు సైన్యం వాగ్నర్ గ్రూప్ రష్యా సైన్యంపై తిరుగుబావుటా ఎగురవేసింది.రష్యా సైన్యానికి వ్యతిరేకంగా పనిచేయనున్నట్లు వాగ్నర్ గ్రూప్ అధిపతి యెవ్జెనీ ప్రిగోజిన్ ప్రకటించారు. రష్యా సైనిక నాయకత్వం నియంతృత్వంగా మారిందన్న ఆయన...వెంటనే నాయకత్వాన్ని మార్చాలని డిమాండ్ చేశారు. రష్యా సైనిక ప్రధాన కార్యాలయం ఉన్న రస్తోవ్ నగరాన్ని... తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు ప్రకటించారు. రష్యా సైన్యంపై వాగ్నర్ గ్రూప్ అధినేత యెవ్జెనీ ప్రిగోజిన్ యుద్ధం ప్రకటించడంపై...ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రిగోజిన్ నిర్ణయాన్ని... ద్రోహంగా, వెన్నుపోటు చర్యగా అభివర్ణించారు. ప్రిగోజిన్ ప్రకటన తర్వాత జాతినుద్దేశించి మాట్లాడిన పుతిన్... వాగ్నర్ సాయుధ తిరుగుబాటుదారులు రోస్టోవ్-ఆన్-డాన్ నగరంలో పౌర, సైనిక పాలక సంస్థలను నిరోధించారని చెప్పారు. తీవ్రమైన నేరపూరిత సాహసానికి ప్రిగోజిన్ ఒడిగట్టారని వ్యాఖ్యానించారు. సాయుధ తిరుగుబాటును.... తీవ్రమైన నేరంగా పుతిన్ అభివర్ణించారు. తిరుగుబాటుదారుల నుంచి తమ దేశాన్ని, ప్రజలను కాపాడుకుంటామని స్పష్టం చేశారు. తిరుగుబాటు దారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తిరుగుబాటు దారులను శిక్షించి తీరుతానని ప్రతిన బూనిన పుతిన్‌... రష్యాకు ఇది ఘోరమైన ముప్పుగా అభివర్ణించారు. రష్యన్ల తలరాతను నిర్ణయించే ఉక్రెయిన్ యుద్ధ సమయాన.. అన్ని శక్తులు ఐక్యంగా ఉండాలన్నారు. రష్యాలో అంతర్గత తిరుగుబాటుపై ఉక్రెయిన్‌ స్పందించింది. ఇదంతా కేవలం ఆరంభం మాత్రమేనని వెల్లడించింది. చేసుకున్న దానికి ఎవరైనా అనుభవించి తీరాలని ఉక్రెయిన్‌ అధ్యక్ష సలహాదారు పోడోలిక్‌ ట్వీట్‌ చేశారు.

Tags

Next Story