Indian General Election : భారత ఎన్నికల్లో జోక్యం?

Indian General Election : భారత ఎన్నికల్లో జోక్యం?
X
రష్యా ఆరోపణలను ఖండించిన అమెరికా

భారత్‌ జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో అమెరికా జోక్యం చేసుకుంటుందన్న రష్యా ఆరోపణలను అగ్రరాజ్యం కొట్టిపారేసింది. తమంటతాముగా ఏ దేశ ఎన్నికల వ్యవహారాల్లో కలుగజేసుకునేది లేదని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మ్యాథ్యూ మిల్లర్‌ అన్నారు. వాస్తవానికి తాము భారత్‌తోపాటు ప్రపంచంలో ఏ ఎన్నికల విషయంలో తాము కల్పించుకోబోమని తెలిపారు. అది భాతరదేశ ప్రజలు తీసుకోవాల్సిన నిర్ణయమని స్పష్టం చేశారు. భారత్‌లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో జోక్యం చేసుకోవడం ద్వారా ఎన్నికల ప్రక్రియను క్లిష్టతరం చేయాలని అమెరికా ప్రయత్నిస్తున్నదంటూ రష్యా సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

ఖలిస్థానీ వేర్పాటువాది గురుపత్వంత్‌సింగ్‌ పన్నున్‌ హత్యకు తమ దేశంలో కుట్ర జరిగిందని, దాని వెనక భారత పౌరుల హస్తం ఉందని ఆరోపించిన అమెరికా అందుకు సంబంధించి ‘నమ్మదగిన సాక్ష్యాల’ను చూపలేదని రష్యా విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి మరియా జఖరోవా గురువారం అన్నారు. భారత్‌లోని మతస్వేచ్ఛను ప్రస్తావిస్తూ భారతదేశ జాతీయ మనస్తత్వం, చరిత్రపై అమెరికాకు ఏ కోశానా అవగాహన లేదని విమర్శించారు. మతస్వేచ్ఛపై నిత్యం నిరాధార ఆరోపణలు చేస్తూనే ఉన్నదని, ఇది భారత్‌ను అగౌరపరచడమేనని మండిపడ్డారు. భారత అంతర్గత రాజకీయ పరిస్థితులను అస్థిరపరచడం, సార్వత్రిక ఎన్నికలను క్లిష్టతరం చేయడమే అమెరికా ఆరోపణల ముఖ్య ఉద్దేశమని ఆమె ఆరోపించారు.

లేటెస్ట్‌గా భారత ఎన్నికల్లో చైనా జోక్యం చేసుకోబోతుందన్న.. మైక్రోసాఫ్ట్ రిపోర్ట్ సంచలనం రేపింది. ఏఐ కంటెంట్‌ను ఉపయోగించి సోషల్ మీడియాలో ప్రచారం చేసి.. ఎన్నికలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు చైనా కుట్రలు చేస్తుందని మైక్రోసాఫ్ట్ హెచ్చరించింది. మీమ్స్‌, వీడియోలు, ఆడియో రూపంలో ప్రచారం చేయవచ్చని తెలిపింది. డీప్‌ఫేక్‌ టెక్నాలజీతో తాము అనుకున్నట్లుగా ఎలక్షన్ క్యాంపెయిన్ జరిగేలా డ్రాగన్ కంట్రీ మైండ్ గేమ్ ఆడుతోందని అలర్ట్ ఇచ్చింది

చైనా ఇంటర్వెన్షన్‌ ఇష్యూ మరువకముందే ఇప్పుడు.. అమెరికా ఇన్వాల్‌మెంట్‌పై వార్తలు రావడం హాట్ టాపిక్ అయింది. ఈ రెండు దేశాలు భారత ఎన్నికల్లో ఎంత వరకు ప్రభావితం చేస్తాయన్న విషయం అటుంచితే.. అసలు ఓ దేశం ఎన్నికల ప్రక్రియలో మరో దేశం ఎందుకు జోక్యం చేసుకోవడం ఏంటన్న దానిపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఆధిపత్య ధోరణి అంతర్గత అంశాల్లో జోక్యం వరకు వస్తే..భవిష్యత్‌లో పరిస్థితులు ఎటువైపు దారి తీస్తాయోనన్న చర్చ జరుగుతోంది.

Tags

Next Story