Israel : రాకెట్లను అడ్డుకునే ఇజ్రాయెల్ ఐరన్‌ డోమ్‌కు ఏమైంది..

Israel :  రాకెట్లను అడ్డుకునే ఇజ్రాయెల్ ఐరన్‌ డోమ్‌కు ఏమైంది..
ఇజ్రాయెల్ శత్రుదుర్భేద్య డోమ్ వ్యవస్థ ఫెయిల్యూరుకు కారణాలు ఏమంటే…

ఇజ్రాయెల్ పై హమాస్ మిలిటెంట్లు చేసిన దాడి కనపడుతున్నంత చిన్నది కాదు. మిలిటెంట్లు ప్రయోగించిన రాకెట్లలో చాలా వాటిని ఐరన్ డోమ్ అడ్డుకుంది. కేవలం 22 నిమిషాల వ్యవధిలో 5 వేలకు పైగా రాకెట్లు ప్రయోగించగా.. అందులో మెజారిటీ రాకెట్లను ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ చాలావరకు అడ్డుకుంది. లేదంటే ఇజ్రాయెల్ భూభాగంలో అతి పెద్ద విధ్వంసం జరిగి ఉండేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఏమిటీ ఐరన్ డోమ్.. ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం.

శత్రు సేనలు రాకెట్లతో తమ దేశంపై దాడి చేయకుండా వందలాది కోట్ల రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేసుకున్న క్షిపణి నిరోధక ఐరన్ డోమ్. అంటే ఇది ఒక యాంటీ మిసైల్ సిస్టమ్. ఆకాశంలో నుంచి దూసుకొచ్చే రాకెట్లు, ఇతరత్రా క్షిపణులను చాలా ముందుగానే గుర్తించి, వాటిని మధ్యలోనే కూల్చేసేలా ఈ వ్యవస్థను తయారు చేశారు. ఇజ్రాయెల్ కు చెందిన రాఫెల్ అడ్వాన్స్ డ్ డిఫెన్స్ సిస్టం, ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ సంయుక్తంగా ఈ వ్యవస్థను అభివృద్ధి చేశాయి. ఒక్కో క్షిపణి ధర 1.1కోట్ల రూపాయలు ఉంటుందని ఇజ్రాయెల్ అధికారులు చెబుతున్నారు. ఈ క్షిపణులు గురి తప్పిన రాకెట్లను కాకుండా నిర్ణీత లక్ష్యాలు, జనావాసాలపై రాకెట్ దాడులు జరగకుండా నిరోధించనుంది.


ఐరన్ డోమ్ వ్యవస్థలో మూడు కాంపొనెంట్స్ ఉంటాయి. అవి.. రాడార్, కమాండ్ కంట్రోల్ సిస్టం, ఇంటర్ సెప్టార్ఇజ్రాయెల్ భూభాగంవైపు దూసుకొచ్చే రాకెట్లను రాడార్ సాయంతో గుర్తించడం మొదటి లెవల్. ఆ రాకెట్ పయనించే మార్గాన్ని పరిశీలించి దాని టార్గెట్ ను గుర్తించడంతో పాటు అడ్డుకునేందుకు కమాండ్ కంట్రోల్ సిస్థం ఉపయోగపడుతుంది. కమాండ్ కంట్రోల్ సూచనలతో రాకెట్ పై ఎదురుదాడి చేసేందుకు ఇంటర్ సెప్టర్ పనిచేస్తుంది.

అయితే ఈ ఐరన్ డోమ్ వ్యవస్థలో అతి కీలకమైన విషయం ఏమిటంటే.. శత్రువులు ప్రయోగించిన రాకెట్ లక్ష్యాన్ని అంచనా వేయడం మాత్రమే కాదు సదరు రాకెట్ తన టార్గెట్ ను చేరగలదా లేదా అనేది కూడా క్షణాలలో లెక్కలేస్తుంది. ఆ టార్గెట్ లో పౌరులు కానీ, కీలకమైన భవనాలు కానీ ఉంటే వెంటనే ప్రతిస్పందిస్తుంది. ఎదురుదాడి చేసి ఆ రాకెట్ ను మధ్యలోనే కూల్చేస్తుంది. అలా కాకుండా శత్రువుల రాకెట్ ఎంచుకున్న టార్గెట్ చేరినప్పటికీ ఇజ్రాయెల్ కు పెద్దగా నష్టం లేదని తేలితే ఎదురుదాడి చేయదు. అంటే శత్రువుల రాకెట్ ను ఉద్దేశపూర్వకంగానే వదిలేస్తుంది. దీనివల్ల ఆయుధ నష్టాన్ని నివారిస్తుంది. గాజా నుంచి హమాస్ మిలిటెంట్ల రాకెట్ దాడుల్లో పలువురు ఇజ్రాయిలీలు మరణించారు. దీనిని బట్టి చూస్తే ఇజ్రాయెల్ దేశంలోని ఐరన్ డోమ్ వ్యవస్థ పూర్తిగా 100 శాతం రక్షణ ఇవ్వలేదని స్పష్టమైంది. తక్కువ సమయంలో ఎక్కువ రాకెట్లను ప్రయోగిస్తే ఐరన్ డోమ్ వ్యవస్థ సక్సెస్ రేటు ఉండదని చెబుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story