All Eyes on Rafah : వైరల్ అవుతున్న ‘ఆల్ ఐస్ ఆన్ రఫా’ పోస్టు

All Eyes on Rafah : వైరల్ అవుతున్న ‘ఆల్ ఐస్ ఆన్ రఫా’ పోస్టు
X
స్పందిస్తున్న సెలబ్రిటీలు

హమాస్‌ ఆధీనంలోని రఫా పట్టణంలో తక్షణం దాడులు ఆపాలని ప్రపంచ దేశాలన్నీ కోరుతున్నా...ఇజ్రాయెల్‌ ఏమాత్రం పట్టించుకోవటం లేదు. అదనపు బలగాలను మోహరించి...దాడులను మరింత ఉద్ధృతం చేసింది. ఇజ్రాయెల్‌ సేనలు జరుపుతున్న క్షిపణి, రాకెట్‌ దాడులతో...రఫా పట్టణంలో పొగలు ఎగిసి పడుతున్నాయి. మరోవైపు కాల్పుల విరమణ పాటించాలని సెలబ్రిటీలు ఆన్‌లైన్‌ వేదికగా ప్రచారానికి శ్రీకారం చుట్టారు.

దక్షిణ గాజాలోని రఫా పట్టణంలో తక్షణం మారణహోమం ఆపాలని ప్రపంచదేశాలు, ఐరాస కోరినా...ఇజ్రాయెల్‌ ఏమాత్రం తగ్గటంలేదు. అదనపు బలగాలను మోహరించి...దాడులను మరింత ఉద్ధృతం చేసింది. హమాస్‌ కీలక నేతలే లక్ష్యంగా...రఫా పట్టణాన్ని జల్లెడపడుతోంది. మొత్తం నాలుగు బ్రిగేడ్ల ఇజ్రాయెల్‌ సైనికులు 30నుంచి 40శాతం భూభాగాన్ని ఆధీనంలో తీసుకున్నట్లు ...ఇజ్రాయెల్‌ మీడియా వెల్లడించింది. సెంట్రల్‌ రఫాలో ప్రవేశించిన ఇజ్రాయెల్‌ సేనలు...వేర్వేరు ప్రాంతాల్లో దాడులు కొనసాగిస్తున్నట్లు...పాలస్తీనా అధికార వార్తా ఏజెన్సీ-తెలిపింది. రఫా పట్టణంలో పొగలు లేస్తున్నట్లు పేర్కొంది. ఇజ్రాయెల్‌ సేనలు దూకుడు పెంచటంతో అక్కడ తలదాచుకుంటున్న పాలస్తీనా ప్రజలు ఖాన్‌ యూనిస్‌సహా ఇతర ప్రాంతాలకు వెళ్తున్నట్లు...పాలస్తీనా మీడియా తెలిపింది. క్షిపణి దాడుల భయంతో...బతుకుజీవుడా అంటూ...మూటాముల్లె సర్దుకొని పాలస్తీనా ప్రజలు ఇతరప్రాంతాలకు వెళ్తున్నట్లు పేర్కొంది.

రఫా పట్టణానికి సమీపంలో మానవతాజోన్‌గా ప్రకటించిన అల్‌-మవాసి ప్రాంతంలో ఇజ్రాయెల్‌ సేనలు జరిపిన దాడుల్లో 37మంది పాలస్తీనా పౌరులు మృతిచెందగా డజన్ల సంఖ్యలో గాయపడ్డారు. మృతుల్లో అత్యధికులు టెంట్లలో తలదాచుకుంటున్న వారేనని తెలుస్తోంది. రఫా క్రాసింగ్‌తోపాటు ఒకప్పుడు ఇజ్రాయెల్‌పైకి హమాస్‌ రాకెట్‌ దాడులు చేసిన ఈజిప్ట్‌ సరిహద్దు ప్రాంతాల్లో పాలస్తీనా మిలిటెంట్లు ఉన్నట్లు...ఇజ్రాయెల్‌ సైన్యం తెలిపింది. ఈ నేపథ్యంలోనే మిలిటరీ ఆపరేషన్‌ నిర్వహించినట్లు పేర్కొంది. ఈసందర్భంగా కీలకంగా భావించే హమాస్‌ సైనిక సదుపాయాలు బయటపడినట్లు ఇజ్రాయెల్‌ సైన్యం ప్రకటించింది.

రఫా పట్టణంలోని శరణార్థుల శిబిరంపై ఇటీవల ఇజ్రాయెల్‌ సేనలు జరిపిన దాడి ఘటనపై తీవ్ర నిరనలు వ్యక్తమవుతున్నాయి. పలువురు సెలబ్రిటీలు ఆన్‌లైన్ వేదికగా ఇజ్రాయెల్‌ దాడిని ఖండిస్తున్నారు. తక్షణం కాల్పుల విరమణ పాటించాలని...ప్రచారం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో ఆల్‌ ఐస్‌ ఆన్‌ రఫా పదం ట్రెండింగ్‌గా మారింది. మనదేశానికి చెందిన నటీనటులు...ఆల్‌ ఐస్‌ ఆన్‌ రఫాతో ఉన్న ఇమేజ్‌ను తమ సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేసి, కాల్పులు విరమణకు అభ్యర్థించారు. సమంత, త్రిష, మాళవికామోహనన్‌, రష్మిక, దుల్కర్ సల్మాన్‌, పార్వతి తిరువొత్తు, అమీజాక్సన్, అలియాభట్‌, కరీనాకపుర్‌, ప్రియాంకా చోప్రా, వరుణ్‌ ధావన్‌, సోనాక్షి సిన్హా, దియామీర్జా, త్రిప్తిడిమ్రి, రిచా చద్దా పాలస్తీనా ప్రజలకు సంఘీభావం తెలిపారు

Tags

Next Story