Israel Palestina: ఇజ్రాయెల్ - పాలస్తీనా వివాదం వందేళ్ల చరిత్ర..

ఇజ్రాయెల్ పాలస్తీనా.. ఈ రెండింటి మధ్య వివాదం కొన్ని దశాబ్దాల నుంచి జరుగుతోంది. కేవలం భూభాగం కోసమే ఈ రెండూ తలపడుతూ వస్తున్నాయి. చివరిసారిగా 2021లో వీరి మధ్య యుద్ధం జరిగింది. ఇప్పుడు మళ్లీ వీటి మధ్య మరోసారి ఘర్షణ మొదలైంది. ఈ నేపద్యంలో ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదం ఏమిటో తెలుసుకుందాం.
మొదటి ప్రపంచ యుద్ధంలో ఒట్టోమన్ సామ్రాజ్యం ఓడిపోయిన తర్వాత పాలస్తీనా అని పిలువబడే భూభాగాన్ని బ్రిటన్ స్వాధీనం చేసుకుంది. అప్పట్లో ఇజ్రాయెల్ అనే దేశమే లేదు. ఇజ్రాయెల్ నుండి వెస్ట్ బ్యాంక్ వరకు ఉన్న ప్రాంతాన్ని పాలస్తీనా భూభాగం అని పిలిచేవారు. ఆ ప్రాంతంలో అరబ్బులు అధిక శాతంలోనూ, అతి తక్కువ మంది యూదులు ఉండేవారు. అందుకే పాలస్తీనా స్థానిక ప్రజలు తమ భూభాగంలో నివసిస్తున్న అరబ్బులు, యూదులు బయటి నుంచి వచ్చిన వ్యక్తులని భావించేవారు. అయితే యూదుల కోసం పాలస్తీనాను ‘జాతీయ నివాసం’గా ఏర్పాటు చేయాలని బ్రిటన్‌ని అంతర్జాతీయ సమాజం కోరింది. ఇదే పాలస్తీనియన్లు, యూదుల మధ్య వివాదానికి బీజం వేసింది. ఇది తమ పూర్వీకుల ఇల్లు అని యూదులు , మాతృభూమి అని పాలస్తీనియన్ అరబ్బులు అనుకున్నారు. యూదుల కోసం ప్రత్యేక రాజ్యం ఏర్పాటు చేయాలనే బ్రిటన్ ఎత్తుగడను ఈ పాలస్తీనియన్ అరబ్బులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ విధంగా పాలస్తీనా-ఇజ్రాయెల్ వివాదం మొదలైంది.
ఇక 1920 – 1940 మధ్య యూరప్‌లో యూదులపై దురాగతాలు జరిగాయి. ఆ సమయంలో యూదులు, పాలస్తీనియన్ల మధ్య హింస కూడా జరిగింది. 1947లో ఐక్యరాజ్యసమితి యూదులు, అరబ్బుల కోసం ప్రత్యేక దేశాలను సృష్టించేందుకు ఓటింగ్ కు పిలుపునిచ్చింది. ఐక్యరాజ్యసమితి చేసిన ఈ ప్రకటనను యూదులు అంగీకరించినప్పటికీ, అరబ్ ప్రజలు వ్యతిరేకించారు. ఈ కారణంగా ఇది ఎప్పుడూ అమలు కాలేదు. ఆ తర్వాత 1948లో యూదు నాయకులు ఇజ్రాయెల్‌ను సృష్టిస్తున్నట్లు ప్రకటించారు. పాలస్తీనియన్లు దీనిని వ్యతిరేకించారు. ఇరుపక్షాల మధ్య మొదటి యుద్ధం ప్రారంభమైంది. కాల్పుల విరమణ అమల్లోకి వచ్చే సమయానికి, ఇజ్రాయెల్ పెద్ద భాగాన్ని కలిగి ఉంది.
జోర్డాన్, ఈజిప్ట్ వంటి అరబ్ దేశాలు పాలస్తీనా ప్రజల కోసం పోరాడాయి. కానీ వారి ఓటమి కారణంగా పాలస్తీనా స్వల్ప భాగానికే పరిమితమైంది. జోర్డాన్ ఆధీనంలోకి వచ్చిన భూమికి వెస్ట్ బ్యాంక్ అని, ఈజిప్టు ఆక్రమించిన ప్రాంతాన్ని గాజా స్ట్రిప్ అని పిలిచేవారు. 1967లో మళ్లీ యుద్ధం జరిగినప్పుడు ఇజ్రాయెల్ తూర్పు జెరూసలేంతో పాటు వెస్ట్ బ్యాంక్, గాజా స్ట్రిప్‌ను స్వాధీనం చేసుకుంది. ఆ తర్వాత గాజా నుంచి ఇజ్రాయెల్ వైదొలిగింది, కానీ వెస్ట్ బ్యాంక్‌ను నియంత్రిస్తూనే ఉంది.
జెరూసలేం నగరం జుడాయిజం, ఇస్లాం, క్రిస్టియానిటీ అనే మూడు మతాలకు చాలా ముఖ్యమైనది. అల్-అక్సా మసీదు జెరూసలేంలో ఉంది. ఇది ఇస్లాంలోని అత్యంత పవిత్రమైన మసీదులలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఇక్కడ టెంపుల్ మౌంట్ కూడా ఉంది. అక్కడ యూదు మతానికి చెందిన వారు ప్రార్థన చేస్తారు. ఇకపోతే, జెరూసలేంలోని క్రైస్తవులకు సంబంధించి చర్చ్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ ఉంది. ఇది వారి ప్రధాన ప్రదేశం. ఈ ప్రదేశం యేసు క్రీస్తు మరణం, శిలువ వేయడం, పునరుత్థానం కథకు ప్రధానమైనది. ఈ కారణంగానే ఈ నగరానికి సంబంధించి మూడు మతాల ప్రజల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com