Israel Palestine War : సరిహద్దుల్లో భారీగా యుద్ధ ట్యాంకులు, సైన్యం

గాజా, లెబనాన్, సిరియా ఇలా మూడువైపుల నుంచి తమపై దాడులు జరుగుతున్నా ఇజ్రాయెల్ దీటుగా బదులిస్తోంది. గాజా సరిహద్దుల్లో భారీగా సైన్యాన్ని, యుద్ధ ట్యాంకులను మోహరించి భూతల దాడికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఐదురోజులుగా సాగుతున్న భీకరపోరులో ఇరువైపులా 3 వేల 600 మందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. హమాస్ మిలిటెంట్ల దాడికి ప్రతీకారంగా గాజాపై ఇజ్రాయెల్ దాడులు మరింత ముమ్మరం చేసింది. సరిహద్దుల్లో భారీగా యుద్ధ ట్యాంకులు, సైన్యాన్ని మోహరించింది. గాజాపై ఇజ్రాయెల్ భూతల యుద్ధానికి దిగనుందనే ఊహాగానాలు చెలరేగుతున్నాయి. బుధవారం గాజా నగరంలోని ఇస్లామిక్ విశ్వవిద్యాలయంపై వైమానిక దాడి చేసిన ఇజ్రాయెల్ అందులో ఉన్న భవనాలను శిథిలాల గుట్టగా మార్చింది. ఇక్కడ అనేక మంది మిలిటెంట్లకు శిక్షణ ఇస్తున్నట్లు ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో 22 వేలకుపైగా ఇళ్లు, 10 ఆస్పత్రులు, 48 పాఠశాలలు ధ్వంసమైనట్లు పాలస్తీనా వర్గాలు తెలిపాయి. ఇజ్రాయెల్ దాడుల్లో 1050 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారని, 5 వేల మందికిపైగా గాయపడ్డారని తెలిపాయి. తమ భూభాగంలో 1500 మందికిపైగా హమాస్ మిలిటెంట్లను హతమార్చినట్లు ఇజ్రాయెల్ ఇప్పటికే ప్రకటించింది. గాజా నుంచి హమాస్ ప్రయోగిస్తున్న రాకెట్లను ఇజ్రాయెల్ గగనతలరక్షణ వ్యవస్థ ఐరన్ డోమ్ అడ్డుకుంటోంది.
గాజాలో వేలాది భవనాలను ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు నేలమట్టం చేస్తుండగా త్వరలోనే గాజా గుడారాల నగరంగా మారనుంది ఇజ్రాయెల్ సైన్యాధికారులు వెల్లడించారు. గాజాపై దాడుల్లో హమాస్‌కు చెందిన విమాన నిఘా వ్యవస్థను ఇజ్రాయెల్ ధ్వంసం చేసింది. కొన్ని భవనాలపై ఉన్న సోలార్ ప్యానళ్ల చాటున ప్రత్యేకమైన కెమెరాలు ఏర్పాటు చేసి దీనిని ఏర్పాటు చేశారు. ఇజ్రాయెల్ విమానాలు గాల్లో ఉండగానే వాటి కదలికలను హమాస్ ఉగ్రవాదులు వీటి ద్వారా గుర్తిస్తున్నారు. ఇలాంటివి గాజా వ్యాప్తంగా పలు చోట్ల ఉన్నాయి. వీటిని ధ్వంసం చేసిన విషయాన్ని ఐడీఎఫ్ దళాలు ట్విట్టర్‌లో వెల్లడించాయి. ఇప్పటికే హమాస్ నౌకలను ఇజ్రాయెల్ పేల్చివేసింది. గాజా పట్టీలోని మధ్యదరా సముద్రం నుంచి హమాస్ డైవర్లు ఈదుకొంటూ వచ్చి ఇజ్రాయెల్‌లో చొరబడ్డారు. ఈ నేపథ్యంలో గాజా సిటీ, ఖాన్ యూనిస్ రేవుల వద్ద ఉన్న హమాస్ నౌకలను ఇజ్రాయెల్ పేల్చివేసింది.
ఇజ్రాయెల్ ముప్పేట దాడులను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా గాజా వైపు నుంచి హమాస్ దాడి చేస్తుండగా.. మరో రెండు దిశలు... లెబనాన్, సిరియా నుంచి కూడా దాడులు మొదలయ్యాయి. హమాస్ దాడి మొదలుపెట్టిన రెండో రోజే లెబనాన్ భూభాగం నుంచి కూడా దాడులు మొదలయ్యాయి.. ఇజ్రాయెల్‌పై హెజ్బొల్లా రాకెట్లను ప్రయోగించింది. తాజాగా ఇజ్రాయెల్ పోస్టులపై లెబనాన్ చెందిన ఈ గ్రూపు యాంటీ ట్యాంక్ క్షిపణిని పేల్చేసింది. ఈ రెండు దేశాల మధ్య 2006లో తీవ్ర స్థాయిలో పోరు జరిగింది. ఇజ్రాయెల్ చేసిన ప్రతిదాడుల్లో లెబనాన్‌లోని సరిహద్దు గ్రామాల్లో ఇళ్లు దెబ్బతిన్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com