Suchir Balaji: సుచీర్ బాలాజీ తల్లి పూర్ణిమ సంచలన ఆరోపణలు

ఇటీవల అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన భారతీయ అమెరికన్ సుచీర్ బాలాజీ అంశం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తాజాగా, బాలాజీ తల్లి పూర్ణిమ రావు సంచలన ఆరోపణలు చేశారు. తన కుమారుడ్ని ఓపెన్‌ఏఐ సంస్థ హత్యచేసిందని ఆరోపించారు. ఓపెన్‌ఏఐకి వ్యతిరేకంగా తన కొడుకు వద్ద ఆధారాలు ఉన్నాయని చెప్పారు. వారు ఏమి చేస్తున్నారనేది మొత్తం సమాచారం బాలాజీకి తెలుసని పేర్కొన్నారు. తమ సంస్థ రహస్యాలు బయటపడకుండా ఉండాలనే కారణంతోనే తన కొడుకును చంపేశారని వ్యాఖ్యానించారు.
టక్కర్ కార్లసన్‌తో జరిగిన ఇంటర్వ్యూలో పూర్ణిమరావు మాట్లాడుతూ.... ఆమె తన కుమారుడి మరణం, కృత్రిమ మేధకు సంబంధించి పలు అంశాలను వెల్లడించారు. ‘నా కొడుకు చనిపోవడానికి ఒక రోజు ముందు పుట్టిన రోజు వేడుకలు చేసుకున్నాడు.. ఒకవేళ అతడు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే జన్మదిన వేడుకలు చేసుకునేవాడా? ఆ ఉద్దేశమే ఉంటే తండ్రి పంపిన పుట్టినరోజు జన్మదిన కానుకలను బాలాజీ చనిపోయే రోజు ఎలా అందుకుంటాడు’ అని అనుమానాలు వ్యక్తం చేశారు.
‘‘ఓపెన్‌ఏఐకి వ్యతిరేకంగా బాలాజీ వద్ద ఆధారాలు ఉన్నాయి. అందుకే చంపేశారు.. అతడి అపార్టుమెంట్‌లో కొన్ని డాక్యుమెంట్లు కనిపించడం లేదు. చాట్‌జీపీటీ రూపకర్తలు విచారణను ప్రభావితం చేశారు... ఈ విషయం గురించి తెలిసిన వ్యక్తులను తమ అధీనంలో ఉంచుకున్నారు.. అందుకే నిజం చెప్పడానికి ఎవరూ ముందుకు రావడం లేదు.. లాయర్లు సైతం ఆత్మహత్యగా చెబుతున్నారు.. కేవలం 14 నిమిషాల వ్యవధిలోపే సుచీర్ బాలాజీ మృతిని ఆత్మహత్యగా అధికారులు తేల్చారు’’ అని పూర్ణిమ వాపోయారు.
ఇదే సమయంలో అధికారులపై కూడా ఆరోపణలు చేశారు. పూర్తి సమాచారం చెప్పడం లేదని, వాళ్లు పారదర్శకంగా వ్యవహరించడం లేదని పేర్కొన్నారు. మరోవైపు, ఈ ఇంటర్వ్యూ వీడియోను ఎక్స్‌లో పోస్టుచేసిన ఎలాన్ మస్క్.. ఇది తీవ్రమైన ఆందోళన కలిగించేదిగా ఉందని అన్నారు. కాగా, బాలాజీ ఆత్మహత్యపై మస్క్ ముందు నుంచి అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com