Nobel to Donald Trump : డొనాల్డ్ ట్రంప్‌కు నోబెల్ ప్రైజ్ ఇవ్వాల్సిందేనట..

డొనాల్డ్ ట్రంప్ నోబెల్ శాంతి బహుమతిపై మనసు పాడేసుకున్నారు. ఎక్కడికెళ్లినా తన వల్లే ఆయా దేశాల్లో యుద్ధాలు ఆగియంటూ చెబుతున్నారు. తాజాగా వైట్‌హౌస్ కూడా అదే ప్రకటన చేసింది. ఆరు నెలల పదవీ కాలంలో ట్రంప్ ఆరు శాంతి ఒప్పందాలు చేశారని.. నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ డిమాండ్ చేశారు. ఇజ్రాయెల్-ఇరాన్, భారతదేశం-పాకిస్థాన్, థాయిలాండ్-కంబోడియా, రువాండా-కాంగో డెమొక్రాటిక్ రిపబ్లిక్, సెర్బియా-కొసావో, ఈజిప్ట్-ఇథియోపియా మధ్య ఉద్రిక్తతలను ట్రంప్ ముగించారని కరోలిన్ లీవిట్ తెలిపారు. ఆరు శాంతి ఒప్పందాలను చేసిన ట్రంప్‌కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని వైట్‌హౌస్ అధికారికంగా ప్రకటించింది. ఆరు నెలల పదవీకాలంలో సగటున నెలకు ఒక శాంతి ఒప్పందం లేదా కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహించారని పేర్కొన్నారు. ఇటీవలే నోబెల్ శాంతి బహుమతికి తాను అర్హుడనని ట్రంప్ తెలిపారు. ఈ ప్రకటన వెలువడిన కొన్ని రోజులకే వైట్‌హౌస్ నుంచి అధికారిక ప్రకటన రావడం విశేషం.
భారత్-పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణకు కృషి చేసింది తానేనని పదే పదే ట్రంప్ చెబుతున్నారు. కానీ భారత్ మాత్రం ఖండిస్తూనే ఉంది. కాల్పుల విరమణలో మూడో వ్యక్తి ప్రమేయం లేదని.. ఇరు దేశాల చర్చలతోనే కాల్పుల విరమణ జరిగినట్లుగా భారత్ స్పష్టం చేసింది. మోడీ, ట్రంప్ మధ్య ఎటువంటి సంభాషణ జరగలేదని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ సోమవారం లోక్‌సభలో స్పష్టంగా పేర్కొన్నారు. ఏప్రిల్ 22న అధ్యక్షుడు ట్రంప్ తన సానుభూతిని తెలియజేయడానికి ఫోన్ చేసినప్పటి నుంచి జూన్ 17 వరకు ఎటువంటి సంభాషణ జరగలేదని తెలిపారు. కానీ తాజాగా వైట్‌హౌస్ కూడా భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధాన్ని ఆపింది ట్రంపేనని తెలిపింది. దీనిపై భారత్ ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇదిలా ఉంటే ట్రంప్‌కు నోబెల్ శాంతి బహుమతి కోసం పాకిస్థాన్, ఇజ్రాయెల్ మద్దతు తెలిపాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com