AMERICA: వైట్‌హౌస్‌లో టెన్షన్... టెన్షన్...

ప్రపంచంలోనే పటిష్ఠమైన భద్రత కలిగిన భవనం.. నిత్యం నిఘా నేత్రాల నీడ.. ఎటు చూసినా భద్రతా సిబ్బంది పహారా.. అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ గురించే ఇదంతా. ఇంతటి భద్రత కలిగిన భవన సముదాయంలో తెల్లటి పౌడరు కనిపించడం భద్రతా దళాలను టెన్షన్‌కు గురిచేసింది. ఈ వైట్ పౌడర్ వల్ల భవనాన్ని కొంతసేపు అధికారులు ఖాళీ చేయించి, తనిఖీలు నిర్వహించారు. శ్వేతసౌధంలోని వెస్ట్ వింగ్‌లో తెలుపు రంగు పొడి ఉన్న ఓ అనుమానిత ప్యాకెట్‌ను సీక్రెట్ సర్వీస్ సిబ్బంది గుర్తించారు. అప్రమత్తమైన అధికారులు.. ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు. భవనంలోని వారిని ఖాళీ చేయించి.. కొద్దిసేపు సురక్షిత ప్రదేశానికి తరలించారు. అనంతరం పొడిని ల్యాబ్‌కు పంపి పరీక్షించడంతో అది కొకైన్ అని తేలింది. అది ప్రమాదకరమైన పదార్థం కాదని నిర్దారణ కావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ప్రదేశంలోకి అది ఎలా వచ్చిందని తెలుసుకోడానికి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటన సమయంలో అధ్యక్షుడు జో బైడెన్ వైట్‌హౌస్‌లో లేరని అధికార వర్గాలు తెలిపాయి. వాస్తవానికి వైట్‌హౌస్ సందర్శనకు వచ్చే వారిని ఈస్ట్ వింగ్‌లోకి మాత్రమే అనుమతిస్తారు. వెస్ట్ వింగ్‌లోకి ఎవర్నీ అనుమతించరు. అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, ఇతర ఉన్నత అధికార యంత్రాంగం కార్యాలయాలు అక్కడే ఉంటాయి. ఇతరులను లోపలికి అనుమతించని ఈ ప్రదేశంలోకి కొకైన్ ఎవరు తీసుకొచ్చారనేది చర్చనీయాంశంగా మారింది.
తెల్లటి పొడిని పదార్థాన్ని తదుపరి పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపామని.. అది వైట్ హౌస్‌లోకి ఎలా ప్రవేశించిందనే దానిపై విచారణ కొనసాగిస్తున్నామని సీక్రెట్ సర్వీస్ సీక్రెట్ సర్వీస్ అధికార ప్రతినిథి ఆంథనీ గుగ్లియె ఓ ప్రకటనలో తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com