కరోనా కంటే డేంజర్ మహమ్మారి రాబోతోంది: WHO

కరోనా మహమ్మారి పీడ విరగడ కాకముందే ప్రపంచాన్ని మరో వైరస్ వణికించబోతున్నట్లు తెలుస్తోంది. కరోనా దాటికి ఇప్పటికే యావత్ ప్రపంచం వణికిపోయింది. మూడేళ్లైనప్పటికీ ఆ ప్రభావం నుంచి ప్రపంచ దేశాలు ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ఈ క్రమంలో కరోనా కంటే ప్రాణాంతక మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రపంచదేశాలు సిద్ధంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. తదుపరి వచ్చే మహమ్మారి కరోనా కంటే మరింత ప్రాణాంతకంగా ఉండవచ్చని WHO చీఫ్ టెడ్రోస్ అధనోమ్ అన్నారు.
జెనీవాలో జరిగిన 76వ ప్రపంచ ఆరోగ్య సమావేశంలో పాల్గొన్న టెడ్రోస్ అధనోమ్.. మూడేళ్లనుంచి ప్రపంచాన్ని కరోనా మహమ్మారి తలకిందులు చేస్తోందన్నారు . ఇప్పటి వరకు సుమారు 70లక్షల మరణాలు నమోదయ్యాయన్నారు. అయితే ఈ సంఖ్య ఎన్నో రెట్లు ఎక్కువ ఉంటుందని అందరికి తెలుసన్నారు. కరోనా మహమ్మారి ముగిసిపోయినట్లు కాదన్నారు. వ్యాధి వ్యాపించేందుకు కారణమయ్యే మరో వేరియంట్ రావచ్చన్నారు. మరణాలు కూడా సంభవించవచ్చని చెప్పారు.
మరింత ప్రాణాంతకమైన వైరస్ ఉద్భవించే ముప్పు ఉందన్నారు. మరిన్ని సంక్షోభాలు ముంచుకొచ్చే ప్రమాదం ఉన్న నేపథ్యంలో.. తదుపరి మహమ్మారి తలుపుతట్టిన వెంటనే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. ఇక తదుపరి మహమ్మారిని నిర్మూలించేందుకు తీసుకోవాల్సిన చర్యలను చర్చించేందుకు ఇదే సరైన సమయమన్నారు. ప్రజారోగ్యానికి తొమ్మిది వ్యాధులు అత్యంత ప్రమాదకరంగా మారాయన్న డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్ చికిత్స లేకపోవడం, మహమ్మారికి దారితీసే సామర్థ్యం కలిగి ఉండటం వల్ల ఇవి ప్రమాదకరమైనవిగా మారినట్టు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com