Pandemic: మరో మహమ్మారికి సిద్ధం కావాలన్న డబ్ల్యూహెచ్ఓ

ఐదేళ్ల కిందట వ్యాప్తిలోకి వచ్చిన కరోనా వైరస్ మిగిల్చిన నష్టాల నుంచి ప్రపంచం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. మహమ్మారి చేదు జ్ఞాపకాలు ఇంకా కళ్లముందు కదలాడుతున్నాయి. అయితే, ప్రపంచానికి మరో మహమ్మారి ముప్పు పొందని ఉందని తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరించింది. ఇది తప్పదని, ఎప్పుడైనా సంభవించవచ్చని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ ఘ్యాబ్రియేసస్ వెల్లడించారు. కాబట్టి, సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు. జెనీవాలో జరిగిన డబ్ల్యూహెచ్‌వో పాండమిక్ అగ్రిమెంట్ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
టెడ్రోస్ మాట్లాడుతూ.. కోవిడ్-19 మహమ్మారి ప్రపంచానికి కలిగించిన నష్టాన్ని గుర్తు చేశారు. పరిస్థితులు చక్కబడే వరకు మరో మహమ్మారి ఆగదని ఆయన అన్నారు. అది 20 ఏళ్ల తర్వాత లేదా రేపే రావచ్చు అని చెప్పారు. కానీ, కచ్చితంగా వస్తుందని, దానికి సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఇది సిద్ధాంతపరమైన ప్రమాదం కాదని, ఒక ఎపిడెమియోలాజికల్ ఖచ్చితత్వమని ట్రెడోస్ అన్నారు. కోవిడ్ వల్ల చాలా మంది చనిపోయారని, అలాగే, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కూడా భారీ నష్టం వాటిల్లిందని తెలిపారు.
‘కొవిడ్-19 మహమ్మారి సృష్టించిన విలయాన్ని అందరం చూశాం. అధికారికంగా 70 లక్షల మంది ప్రాణాలు కోల్పోయినప్పటికీ.. వాస్తవానికి ఆ సంఖ్య 2 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నాం. ప్రాణ నష్టంతో పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు 10 ట్రిలియన్ డాలర్ల కంటే ఎక్కువ నష్టాన్ని కలిగించింది.. 1918 నాటి ఫ్లూ మహమ్మారి 50 మిలియన్ల మందిని పొట్టనబెట్టుకుంది.. కరోనాతో పోల్చితే ఇది రెండింతలు అధికం’ అని టెడ్రోస్ అన్నారు. మహమ్మారి ఒప్పందంపై సభ్య దేశాల మధ్య ఏకాభిప్రాయం వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com