Olena Zelenska: ఉక్రెయిన్ అధ్యక్షుడి భార్య.. యుద్ధరంగంలో భర్తకు తోడుగా..

Olena Zelenska: ఉక్రెయిన్ అధ్యక్షుడి భార్య.. యుద్ధరంగంలో భర్తకు తోడుగా..
Olena Zelenska: 44 ఏళ్ల ఒలెనా జెలెన్స్కా మొదటి పేరు కియాష్కో. రిహ్ నేషనల్ యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్ చదువుకున్నారు.

Olena Zelenska: అధ్యక్షుడి భార్య అయినా పబ్లిక్ పర్సన్‌ని కాదంటారు.. ప్రత్యర్థి టార్గెట్ తామే అయినా.. భయంతో పారిపోను.. భర్తకు తోడుగా ఉంటాను అని అంటున్నారు ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాడిమర్ జెలెన్స్కీ సతీమణి ఒలెనా జెలెన్స్కా ఉక్రెయిన్ ప్రథమ మహిళ, జెలెన్స్కీ కలిసి చదువుకున్నారు.. అప్పుడే ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. 44 ఏళ్ల ఒలెనా జెలెన్స్కా మొదటి పేరు కియాష్కో. రిహ్ నేషనల్ యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్ చదువుకున్నారు. అక్కడే లా చదువుతున్న జెలెన్స్కీతో ప్రేమలో పడ్డారు.


అతడు నటించే కామెడీ సీరియల్ సర్వెంట్ ఆఫ్ ది పీపుల్‌కి రచయిత అయ్యారు. 2010లో ఉక్రెయిన్‌లో అదే నెంబర్ వన్ సీరియల్‌గా దూసుకెళ్లింది. అవినీతి రాజకీయ నాయకులతో విసిగిపోయిన తర్వాత అధ్యక్షుడయ్యే హైస్కూల్ టీచర్‌గా జెలెన్స్‌కీ నటించారు. ఆ సీరియల్ అతడికి మంచి పేరు తెచ్చిపెట్టింది. అనూహ్యంగా అచ్చంగా ఆ సీరియల్‌లో జరిగినట్లే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి అత్యధిక మెజారిటీతో ఎన్నికయ్యాడు జెలెన్స్‌కీ. దేశంలోని అత్యంత ప్రభావవంతమైన మహిళల్లో ఒకరిగా ఆమె పేరు వినిపిస్తోంది ప్రస్తుతం.

జెలెన్స్ కీ.. ఒలెనాను సెప్టెంబరు 6, 2003న వివాహం చేసుకోవడానికి ముందు ఎనిమిది సంవత్సరాలు డేటింగ్ చేశారు. వారికి కుమార్తె అలెగ్జాండ్రా, కుమారుడు కిరిల్ ఉన్నారు. ఆమెకు మొదట్లో రాజకీయాలంటే ఇష్టం లేదు.. కానీ భర్త ఇష్టాలను తన ఇష్టాలుగా మార్చుకుంది. జీవిత భాగస్వామికి మద్దతు ఇవ్వడమే తన ప్రధమ కర్తవ్యమని భావించింది.


2019లో, జెలెన్స్కీ ఒక బిలియనీర్ వ్యాపారవేత్తను ఓడించి అధ్యక్షుడిగా నిలిచారు. సోవియట్ యూనియన్ రద్దు అయినప్పటి నుండి ఉక్రెయిన్‌ను అడ్డగోలుగా నియంత్రించిన అవినీతి శక్తిని విచ్ఛిన్నం చేస్తానని అతను అధ్యక్ష ఎన్నికల్లో వాగ్దానం చేశాడు. జెలెన్స్కా ప్రధమ మహిళగా ప్రజల దృష్టిలో ఉన్నప్పటికీ, ఈ జంట తమ పిల్లలను పబ్లిసిటీకి దూరంగా ఉంచాలని నిశ్చయించుకున్నారు.

దేశంలో ఎన్ని సమస్యలు ఉన్నాయో నాకు అర్థమైంది. కానీ ప్రతిదీ సమస్యగా భావిస్తే దానికి పరిష్కారం దొరకదు. కాబట్టి మా బృందం నిర్దిష్ట పనులపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకుంది, పిల్లల ఆరోగ్యం, ఉక్రేనియన్లందరికీ సమాన అవకాశాలు, సాంస్కృతిక దౌత్యం వంటి విషయాలపై ప్రధానంగా దృష్టి సారించింది అని ప్రముఖ పత్రిక వోగ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు జెలెన్స్కా.


ఆమె ఉక్రేనియన్ మహిళా కాంగ్రెస్‌ను ప్రోత్సహించింది. పాఠశాల విద్యార్థుల్లో పోషకాహారలోపాన్ని పరిష్కరించడం, ఉక్రేనియన్ భాషపై అవగాహన పెంచడం కూడా ఉంది. "అధ్యక్షుడి జీవిత భాగస్వామికి అధికారానికి దగ్గరగా ఉన్న వారితో కమ్యూనికేట్ చేయడానికి అవకాశం ఉంది" అని ఆమె వోగ్‌తో అన్నారు. నేను రాజకీయ నాయకురాలిని కాదు, అధ్యక్షుడి పనిలో జోక్యం చేసుకునే హక్కు నాకు లేదు, కానీ ప్రజలకు, అధికారులకు మధ్య మధ్యవర్తిగా మారడానికి, వారు చెప్పేది వినడానికి నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను అని అంటారు జెలెన్స్కా.

ప్రస్తుత పరిస్థితి గురించి భయం, బాధ లేదు.. ధైర్యంగా ఉన్నాను.. నా పిల్లలు నావైపు చూస్తున్నాను. నేను వారి పక్కనే ఉంటాను.. నా భర్తకు అండగా ఉంటాను.. అని చెబుతున్న జెలెన్స్కా మాటలు ప్రపంచ ప్రజల దృష్టిని తనవైపు తిప్పుకునేలా చేశాయి.


భయానక పరిస్థితుల మధ్య ఉన్న ఉక్రెయిన్ ప్రజలు ఒకరికొకరు సహకరించుకుంటున్నారు.. అందుకు ఈ ఘటనే ఉదాహరణ అని ఇన్‌స్టాలో ఒక పోస్ట్ పెట్టారు.. ప్రసవ వేదన పడుతున్న ఓ మహిళ షెల్టర్‌లో శిశువుకు జన్మనిచ్చింది. ఈ జననం ప్రశాంత వాతావరణంలో జరగాల్సింది. ఒకపక్క యుద్ధం జరుగుతున్నా వైద్యులు, సిబ్బంది ఆ తల్లిని జాగ్రత్తగా చూసుకుంటున్నారు అంటూ ఆమె ఇన్‌స్టాలో పెట్టిన పోస్టు ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తోంది. ఈ క్లిష్ట సమయంలో ప్రజలు ఒకరికొకరు సహకరించుకుంటున్నారని ప్రశంసించారు. ప్రజలు నిస్సహాయ స్థితిలోకి జారకుండా మాటలతో ధైర్యం చెప్తున్నారు. రష్యా, ఉక్రెయిన్ పోరు ఎప్పటికి ముగుస్తుందో అర్థం కాని పరిస్థితి..!

Tags

Read MoreRead Less
Next Story