Saima Wazed : షేక్‌ హసీనా కుమార్తెను సెలవుపై పంపిన ప్రపంచ ఆరోగ్య సంస్థ

Saima Wazed : షేక్‌ హసీనా కుమార్తెను సెలవుపై పంపిన ప్రపంచ ఆరోగ్య సంస్థ
X
అవినీతి ఆరోపణలే కారణమా

బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనా కుమార్తె సైమా వాజెద్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సెలవుపై పంపింది. బంగ్లాదేశ్‌ ప్రభుత్వం సైమా వాజెద్‌పై అవినీతి కేసులు (Corruption cases) నమోదుచేసిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.

షేక్‌ హసీనా కుమార్తె సైమా వాజెద్‌ ప్రపంచ ఆరోగ్య సంస్థలో ఆగ్నేయ ఆసియా ప్రాంత రీజనల్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే బంగ్లాదేశ్‌లోని అవినీతి నిరోధక కమిషన్.. సైమాపై అధికార దుర్వినియోగం, మోసం, ఫోర్జరీ తదితర అభియోగాలు మోపింది. దాంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ చర్యలు చేపట్టింది.

సైమా వాజెద్‌ను సెలవుపై పంపించి ఆమె స్థానంలో డాక్టర్ కేథరినా బోహ్మేకు తాత్కాలికంగా బాధ్యతలు అప్పగించింది. అయితే ఈ వ్యవహారంపై స్పందించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ నిరాకరించింది. సైమాను బాధ్యతల నుంచి తొలగించారా అన్న మీడియా ప్రశ్నకు.. ప్రస్తుతం ఆమె సెలవులో ఉన్నారని మాత్రమే WHO చెప్పింది.

కాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆగ్నేయ ఆసియా ప్రాంత రీజనల్‌ కార్యాలయం ఢిల్లీలో ఉంది. అక్కడే విధులు నిర్వహించే సైమా వాజెద్‌ ప్రస్తుతం సెలవుపై వెళ్లారు. కాగా రిజర్వేషన్‌లకు సంబంధించి విద్యార్థులు ఆందోళనలకు దిగడంతో షేక్‌ హసీనా అనూహ్య రీతిలో ప్రధాని పదవిని కోల్పోయారు. దాంతో గత ఏడాది ఆగస్టు 5 నుంచి ఆమె భారత్‌లో తలదాచుకుంటున్నారు.

బంగ్లాదేశ్‌లో యూనస్‌ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైంది. ఆ ప్రభుత్వం హసీనాపై హత్య సహా పలు అభియోగాలు మోపుతూ కేసులు నమోదు చేసింది. ఆమెను స్వదేశానికి రప్పించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ సైమా వాజెద్‌ను సెలవుపై పంపడం హసీనాకు షాక్‌ అనే చెప్పవచ్చు.

Tags

Next Story