Iran Protests: ఇరాన్‌లో మిన్నంటిన నిరసనలు.. ఖమేనీ ఫోటోతో సిగరేట్ వెలిగిస్తున్న మహిళలు..

ఇరాన్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు మిన్నంటుతున్నాయి. సుప్రీంలీడర్ అయతొల్లా అలీ ఖమేనీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఇరాన్‌లో మత ప్రభుత్వాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ‘‘నియంతకు మరణం’’, ‘‘ముల్లాలు వెళ్లిపోవాలి’’ అంటూ నినాదాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ఇప్పుడు అక్కడి మహిళలు వినూత్న రీతిలో నిరసన తెలుపుతున్నారు. దేశాధినేత ఖమేనీ ఫోటోలకు నిప్పుపెట్టి వాటితో అక్కడి మహిళలు సిగరేట్లు వెలిగించుకుంటున్నారు. వీటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలో వైరల్ అవుతున్నాయి
ఇది దేశ మతపరమైన అధికారాలను బహిరంగంగా సవాల్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్స్‌లో ఈ ట్రెండ్ ఊపందుకుంది. ఇది ప్రభుత్వ ధిక్కారానికి శక్తివంతమైన నిరసనగా మారింది. ఇరాన్ అధికారులు ఈ నిరసనల్ని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించినప్పటికీ, ఇంకా ఎక్కువగా ప్రజలు రోడ్లపైకి వస్తున్నారు. ఇప్పటి వరకు ఈ నిరసనల్లో 40 మంది మరణించారు. 20 వేల కన్నా ఎక్కువ మందిని అరెస్ట్ చేశారు.
ఇరాన్ సుప్రీంలీడర్ ఫోటోను తగలబెట్టడాన్ని ఇరానియన్ చట్టం తీవ్రమైన నేరంగా పరిగణించబడుతుంది. దీంతో పాటు మహిళలు సిగరేట్ కాల్చడం ద్వారా మహిళలపై క్రూరంగా అమలు చేస్తున్న హిజాబ్, మహిళల స్వేచ్ఛపై పరిమితులను ఎదురించడమే అవుతుంది. ఇరాన్ వ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం కారణంగా మొదలైన నిరసనలు, ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేక, ఖమేనీ వ్యతిరేక నిరసనలుగా మారాయి. ఇరాన్ మహిళలకు చెందిన వీడియోలు ఇప్పుడు అంతర్జాతీయ సమాజాన్ని ఆకర్షిస్తున్నాయి.
విదేశీ శక్తులకు తలొగ్గేది లేదు: ఖమేనీ
దేశంలో కొనసాగుతున్న నిరసనలపై ఖమేనీ శుక్రవారం మొదటిసారి స్పందిస్తూ తీవ్ర హెచ్చరికలు జారీచేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేతులకు ఇరానియన్ల రక్తపు మరకలు అంటుకున్నాయని, ఆయనను సంతోషపెట్టేందుకే నిరసనకారులు తమ సొంత ఆస్తులను తామే నాశనం చేసుకుంటున్నారని ఖమేనీ మండిపడ్డారు. దేశంలో హింసను రెచ్చగొడుతున్న నిరసనల వెనుక విదేశీ ఏజెంట్లు ఉన్నారని ఖమేనీ ఆరోపించారు. విదేశీ శక్తుల కుయుక్తులకు తలొగ్గేది లేదని స్పష్టం చేశారు.
జవనరి 31లోగా ఖమేనీ నాయకత్వం నుంచి ఇరాన్‌కు స్వేచ్ఛ లభిస్తుందంటూ ఇన్వెస్టోపీడియా అనే ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ వెబ్‌సైట్ శుక్రవారం జోస్యం చెప్పింది. ఇరాన్ కరెన్సీ రియాల్ పతనం కావడంతో ప్రజల్లో ఆందోళనలు తలెత్తి డిసెంబర్ 28 నుంచి దేశంలో నిరసనలు ప్రారంభమయ్యాయి. దేశ రాజధాని టెహ్రాన్‌లో బజార్లు మూతపడడంతో ప్రారంభమైన నిరసనలు దేశవ్యాప్తంగా విస్తరించాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

