Shubhanshu Shukla: అంతరిక్ష కేంద్రంతో కనెక్ట్ అవ్వడానికి ఎంత సమయం పడుతుంది..?

Shubhanshu Shukla: అంతరిక్ష కేంద్రంతో కనెక్ట్ అవ్వడానికి ఎంత సమయం  పడుతుంది..?
X
పూర్తి వివరణ ఇదే !

భారత దేశానికి చెందిన వ్యోమగామి శుభాంశు శుక్లా రోదసియాత్రకు వెళ్లారు. శుక్లాతో పాటు మరో ముగ్గురు వ్యోమగాములను తీసుకుని యాక్సియం-4 నింగిలోకి దూసుకెళ్లింది. ఫ్లోరిడాలోని నాసా కెన్నెడీ స్పేస్‌సెంటర్‌లో బుధవారం మధ్యాహ్నం 12:01 గంటలకు చేపట్టిన ఫాల్కన్‌ 9 రాకెట్‌ ప్రయోగం విజయవంతంగా అంతరిక్షంలోకి దూసుకెళ్లింది. కొద్ది క్షణాల తర్వాత రాకెట్‌ నుంచి వీరి క్యాప్సుల్‌ విడిపోయి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌) దిశగా ప్రయాణం కొనసాగించింది. అయితే, వ్యోమనౌక గురువారం సాయంత్రం 4:30 గంటలకు ఐఎస్‌ఎస్‌తో అనుసంధానం అవుతుంది.

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం భూమి నుండి దాదాపు 400 కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది. భూమి కక్ష్యలో గంటకు 28000 కిలో మీటర్ల వేగంతో తిరుగుతోంది. ఇది కదిలే లక్ష్యంకు అనుగుణంగా అంతరిక్ష నౌక ఖచ్చితంగా కలుసుకోవాలి. శుభాంశు శుక్లా, అతని బృందాన్ని తీసుకెళ్లిన స్పేస్‌ఎక్స్ వోమనౌక అంతరిక్ష కేంద్రంతో డాకింగ్ కావాలంటే 28గంటల సమయం పడుతుంది. దీని వెనుక సాంకేతిక, శాస్త్రీయ కారణాలు ఉన్నాయి.

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం భూమి చుట్టూ ఒక స్థిర కక్ష్యలో అధిక వేగంతో పరిభ్రమిస్తుంది. ఫాల్కన్9 రాకెట్ దానిని చేరుకుని అందులోని క్యాప్సూల్స్‌తో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి డాకింగ్ కావాలంటే అందుకు అది కూడా అంతే వేగంతో, అదే మార్గంలో కదులుతూ ఉండాలి. అప్పుడు రెండూ ఒకదాని వెనుక ఒకటి ప్రయాణిస్తూ ఉంటాయి. ప్రయాణం ప్రారంభమైన 25 గంటల వరకూ స్పేస్ ఎక్స్ క్యాప్సూల్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం దగ్గరగా, అదే వేగంతో ప్రయాణిస్తూ వచ్చేందుకు ప్రయత్నిస్తుంది. ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత నెమ్మదిగా తన వేగాన్ని పెంచుకుంటూ ఐఎస్ఎస్ డాకింగ్ అడాప్టర్‌కు దగ్గరవుతుంది.

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంతో డాకింగ్ చేయడం చాలా ఖచ్చితమైన, సంక్లిష్టమైన ప్రక్రియ. అంతరిక్ష నౌక అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం యొక్క వేగం, స్థానానికి సరిగ్గా సరిపోలాలి. ఈ సమయంలో ఏదైనా పొరపాటు జరిగితే ప్రమాదకరం కావచ్చు. అందువల్ల సురక్షితమైన డాకింగ్ ను నిర్ధారించడానికి డ్రాగన్ నెమ్మదిగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం వద్దకు చేరుకుంటుంది. స్పేస్ ఎక్స్ క్యాప్సూల్ ఐఎస్ఎస్ కక్ష్యలోకి ప్రవేశించిన తర్వాత, దానితో అనుసంధానం అయ్యేలా దగ్గరయ్యేందుకు కూడా రెండు మూడు గంటల సమయం పడుతుంది. పరిస్థితులన్నీ అనుకూలిస్తే, అందర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఒక డాకింగ్ అడాప్టర్ దగ్గరకు వెళ్లి దానితో అనుసంధానం అవుతుంది.

Tags

Next Story