Island Invasion : ‘ఖార్గ్ ద్వీపం’ జోలికి వెళ్లని అమెరికా, ఇజ్రాయెల్.. రీజన్ ఏంటంటే ..

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఘర్షణలు పశ్చిమాసియాను తీవ్ర సంక్షోభంలోకి నెడుతున్నాయి. గత కొన్ని రోజులుగా ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడులు కొనసాగిస్తుండగా, ఇరాన్ కూడా ప్రతీకారంగా క్షిపణి దాడులతో స్పందిస్తోంది. దీంతో ప్రాంతమంతా యుద్ధ వాతావరణం నెలకొంది.
ఖార్గ్ ద్వీపం ప్రాధాన్యం
పర్షియన్ గల్ఫ్‌లో ఇరాన్ తీరానికి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖార్గ్ ద్వీపం ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకమైన కేంద్రంగా గుర్తింపు పొందింది. విస్తీర్ణం పరంగా చిన్నదైనా, చమురు ఎగుమతుల విషయంలో ఇది అత్యంత ప్రాధాన్యాన్ని కలిగి ఉంది. ఇరాన్ ప్రపంచానికి ఎగుమతి చేసే చమురులో దాదాపు 90 శాతం ఈ ద్వీపం నుంచే రవాణా అవుతుందని నివేదికలు చెబుతున్నాయి.
ప్రపంచ చమురు సరఫరాలో కీలక పాత్ర
ఖార్గ్ ద్వీపంలోని టర్మినళ్లు రోజుకు సుమారు ఏడు మిలియన్ బ్యారెళ్ల చమురును లోడ్ చేయగల సామర్థ్యం కలిగి ఉన్నాయని అంతర్జాతీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇరాన్ విదేశాలకు పంపే చమురులో పెద్ద భాగం ఇక్కడ నుంచే వెళ్లడం వల్ల ఈ ద్వీపాన్ని ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా భావిస్తారు.
దాడి చేస్తే ప్రపంచానికి ముప్పు
ఈ ద్వీపంపై దాడి జరిగితే ఇరాన్ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే అదే సమయంలో ప్రపంచ చమురు మార్కెట్‌పై కూడా భారీ ప్రభావం పడే అవకాశం ఉంది. ఇప్పటికే మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల కారణంగా ముడి చమురు ధరలు భారీగా పెరిగి బ్యారెల్ ధర 110 డాలర్లకు పైగా చేరుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఖార్గ్ ద్వీపంపై దాడి జరిగితే చమురు ధరలు మరింత పెరిగే ప్రమాదం ఉంది.
హోర్ముజ్ జలసంధిలో ఉద్రిక్త పరిస్థితులు
ఇదిలా ఉండగా హోర్ముజ్ జలసంధి ప్రాంతంలో కూడా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ మార్గం ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైనది. ప్రస్తుతం అక్కడ వందలాది ఆయిల్ ట్యాంకర్లు నిలిచిపోయినట్లు సమాచారం. కొన్ని నౌకలు తమ లొకేషన్ సిగ్నల్స్ నిలిపివేయడంతో రవాణా వ్యవస్థలో అంతరాయం ఏర్పడిందని నివేదికలు చెబుతున్నాయి.
ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై వ్యూహాత్మక ఒత్తిడి పెంచే అవకాశాలపై ఆలోచిస్తున్నట్టు సమాచారం. అయితే ఖార్గ్ ద్వీపంపై దాడి జరిగితే ప్రపంచ చమురు మార్కెట్ మరింత కుదేలయ్యే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అందుకే ఇప్పటివరకు అమెరికా, ఇజ్రాయెల్ ఆ ద్వీపం జోలికి వెళ్లకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయని భావిస్తున్నారు.
ప్రస్తుతం అక్కడి చమురు కేంద్రాలు యథావిధిగా పనిచేస్తున్నప్పటికీ, యుద్ధ పరిస్థితులు కొనసాగితే సరఫరా వ్యవస్థపై మరింత ప్రభావం పడే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. పరిస్థితులు ఎటు దారి తీస్తాయో అన్నదానిపై ప్రపంచ దేశాలు ఉత్కంఠగా గమనిస్తున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
