Israel-Hamas war: ఇదొక అంతులేని కధ

Israel-Hamas war: ఇదొక అంతులేని కధ
హమాస్‌-ఇజ్రాయెల్‌ యుద్ధానికి నేటితో వంద రోజులు

ఇజ్రాయెల్ - హమాస్యుద్ధంతో ఆ నేలలో నెత్తుటేళ్లు పొంగుతున్నాయి. జనవరి 15నాటికి యుద్ధం ప్రారంభమై 100 రోజులు పూర్తయింది. అక్టోబర్ 7 న ప్రారంభమై యుద్ధం వేల సంఖ్యలో అమాయకపు ప్రజల ప్రాణాలను బలికొంది. శాంతి చర్చలకు ప్రయత్నించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది.

ఇరు వైరిపక్షాల నడుమ ఇది ఇంతకుముందెన్నడూ లేని సంకుల సమరం, సాధారణ పౌరుల రక్తపాత ఘట్టం అయింది. ఉధృతమే తప్పితే అంతం సంకేతాలు లేకుండా ఈ వైరివర్గాల ఘర్షణ సాగుతోంది. ఇజ్రాయెల్ 1948లో అవతరించిననాటి నుంచే పాలస్తీనియన్లతో ప్రచ్ఛన్న పోరు సాగుతోంది. అయితే ఇప్పటి ఘర్షణ ఎప్పటికప్పుడు అంతం కాదిది ఆరంభం తరహాలో ఉంది. తమపై హమాస్ సాయుధ బలగాలు గత ఏడాది అక్టోబర్ 7వ తేదీన దొంగదెబ్బ తీశాయని ప్రపంచంలోనే అత్యంత అధునాతన ఆయుధ సంపత్తి, వేగుచర్యల సునిశితత గల ఇజ్రాయెల్ రగులుతోంది. ఇది ఇప్పుడు గాజాస్ట్రిప్‌లో ఎక్కడికక్కడ పూర్తి స్థాయిలో హమాస్ బలగాల నిర్మూలనే ధ్యేయంగా ఇజ్రాయెల్ నేత నెతన్యాహు తమ సేనలను కదిలిస్తున్నారు. దీనిని హమాస్ ఇదే తరహాలో ప్రతిఘటిస్తోంది.

చివరికి సాధారణ పౌరులను తమ ఆత్మరక్షణ కవచాలుగా మార్చుకొందని, ఇజ్రాయెలీ బందీలను అడ్డుగా పెట్టుకుని దాడులకు దిగుతోందని వెల్లడైంది. చివరికి ఈ ఘర్షణల ఉదంతం ఇప్పుడు ఐరాస సారధ్యపు అంతర్జాతీయ న్యాయస్థానం పరిధిలోకి వెళ్లింది. అయితే అక్కడ పరస్పర ఆరోపణలతోనే వివాదాస్పద పర్వం సాగింది , ఇంతకు మించి ఎటువంటి రాజీ దాఖలాలు వెలువడలేదు. తమపై దాడుల తరువాతి క్రమంలో వెంటనే ఇజ్రాయెల్ సైనిక బలగాలు గాజాపై విరుచుకుపడ్డాయి.ముందుగా వైమానిక దాడులు తరువాత భూతల దాడులతో హమాస్ ఆయువుపట్టు స్థావరాలను చివరికి టన్నెల్స్‌ను కూడా నేలమట్టం చేశారు. ఈ క్రమంలో సామాన్య పౌరుడు రోజుల తరబడి తిండితిప్పలు లేకుండా, గాయపడ్డా కనీస చికిత్సకు నోచుకోకుండా నానా పాట్లు పడాల్సి వచ్చింది. అయితే ఇజ్రాయెల్ దాడులను పట్టించుకోకుండా హమాస్ తమ చెరలోని బందీలను అడ్డుపెట్టుకుని ఎదురుదాడులకు దిగుతోంది. దీనితో ఇప్పుడు ఈ వార్ క్రమేపీ ఎర్రసముద్రానికి, ప్రపంచ దేశాల మధ్య విభజనరేఖల తీవ్రతకు దారితీసింది. ఇప్పటి యుద్ధం దాడి వరుసక్రమం .


ఇప్పటి వరకు 24 వేలకుపైగా ప్రాణాలను బలితీసుకోగా పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులను మరింత పెంచింది. దీనికితోడు గాజాలో ఎక్కడ చూసినా మాంసపు ముద్దలే కనిపిస్తున్నాయి. శిథిలాల కింద వందల సంఖ్యలో శవాలు బయటపడుతున్నాయి. మృతుల్లో ఎక్కువ మంది చిన్నారులు, మహిళలే ఉన్నారు. గాజాలో ఆసుపత్రులు, శరణార్థి శిబిరాలు క్షతగాత్రులు,వారి బంధువులతో కిటకిటలాడుతున్నాయి. అమెరికా, ఖతర్ జోక్యంతో యుద్ధాన్ని ముగించాలని చూసినా లాభం లేకుండా పోయింది. యుద్ధానికి 100 రోజులు పూర్తవడం.. ఇప్పటికైనా యుద్ధాన్ని ముగించాలని ప్రపంచ దేశాలు కోరుతున్నాయి.

Tags

Next Story