Pak Army Chief: పాక్ నుంచి ఉగ్రవాదాన్ని వేరుచేస్తాం..

Pak Army Chief: పాక్ నుంచి ఉగ్రవాదాన్ని వేరుచేస్తాం..
X
బలూచిస్తాన్ పేలుళ్లపై స్పందించిన పాక్ ఆర్మీ చీఫ్

పాకిస్తాన్ బలూచిస్తాన్ ప్రావిన్సు, ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సుల్లో ఉగ్రవాదులు జరిపిన జంట ఆత్మాహుతి దాడుల్లో 65 మంది చనిపోయారు. శుక్రవారం జరిగిన ఈ వరుస దాడులతో పాకిస్తాన్ కలవరపడుతోంది. అయితే ఈ దాడిపై పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ స్పందించారు. పాక్ నుంచి ఉగ్రవాద ముప్పును నిర్మూలిస్తామని ఆయన ప్రతిజ్ఞ చేశారు. మస్తుంగ్ లోని మదీనా మసీదు సమీపంలో మహ్మద్ ప్రవక్త జయంతి సందర్భంగా జరిగిన ఊరేగింపు లక్ష్యంగా ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో పదుల సంఖ్యలో ప్రజలు మరణించారు, చాలా మంది తీవ్రగాయాలపాలయ్యారు.

బలూచిస్తాన్ దాడిలో 60 మంది చనిపోగా.. ఖైబర ఫఖ్తుంఖ్వా ప్రావిన్సులో హంగు పోలీస్ స్టేషన్ మసీదు లక్ష్యంగా జరిగిన దాడిలో ఐదుగురు మరణించారు. వందమందికి పైగా గాయాలపాలయ్యారు. పేలుడు ధాటికి మసీదు పైకప్పు కూలి 12 మంది గాయపడ్డారు. ఈ ఘటనల తర్వాత ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ బలూచ్ రాజధాని క్వెట్టాలో పర్యటించారు. ఇస్లాంతో సంబంధం లేని వ్యక్తులు, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే ప్రభుత్వ మద్దతుతో ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని మునీర్ అన్నారు.

ఈ ఉగ్రవాదులు, వారికి సహకరించే వారికి మతం, దాని భావజాలంతో సంబంధం లేదని, పాకిస్తాన్, ఇక్కడి ప్రజలకు శతృవులని ఆయన అన్నారు. ఇతర దేశాల మద్దతు ఉన్న ఈ ఉగ్రవాదాన్ని పాక్ భద్రతా బలగాలు ఎదుర్కొంటాయని మునీర్ అన్నారు. దేశం నుంచి ఉగ్రవాద ముప్పును తరిమికొట్టే వరకు విశ్రమించమని చెప్పారు. అయతే శుక్రవారం పాకిస్తాన్ లో జరిగిన దాడులకు ఇప్పటి వరకు ఏ సంస్థ కూడా బాధ్యత వహించలేదు. ఎప్పటిలా దాడి తరువాత ఏది మా పనే అని ప్రకటించే పాకిస్తాన్ తాలిబాన్లు కూడా ఈ దాడిలో తమ ప్రమేయం లేదని చెప్పారు. పాకిస్తాన్ భద్రతా దళాలు ఎనిమిదేళ్లలో అత్యధిక ప్రాణనష్టాన్ని చవిచూశాయి. 2023 మొదటి తొమ్మిది నెలల్లో కనీసం 386 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని థింక్-ట్యాంక్ నివేదిక వెల్లడించింది. అలాగే సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ సెక్యూరిటీ స్టడీస్ (CRSS) నివేదిక కూడా దేశవ్యాప్తంగా హింస 57 శాతం పెరిగిందని ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ వార్తాపత్రిక నివేదించింది.

Tags

Next Story