Jahnavi kandula: సంఘటన పై క్షమాపణలు చెప్పిన అమెరికా మేయర్

Jahnavi kandula:  సంఘటన పై  క్షమాపణలు చెప్పిన అమెరికా మేయర్
ఏ శిక్షకైనా సిద్ధమే: అమెరికా పోలీస్ అధికారి

భారతీయ విద్యార్థి జాహ్నవి కందుల అమెరికాలో మరణించడం, ఆ తరువాత అక్కడి పోలీస్ అధికారి ఆమె మరణం గురించి హేళగా మాట్లాడటం ఇటు ఇండియాలో, అటు అమెరికాలో వైరల్ గా మారింది. జనవరి నెలలో పెట్రోలింగ్ చేస్తున్న కారు ఢీకొట్టడంతో ఆమె అక్కడికక్కడే మరణించారు. అయితే పోలీస్ అధికారి ఆమె మరణాన్ని తేలిక చేస్తూ మాట్లాడటం, అతని బాడీ కామ్ కెమెరాలో రికార్డైంది. తాజాగా జాహ్నవి మరణంపై సియాటెల్ నగర మేయర్ బ్రూస్ హారెల్ తన ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్ అధికారి డేనియల్ ఆడెరర్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఆయన భారత సమాజానికి క్షమాపణ చెప్పారు. ఈ దురదృష్ట సంఘటన, అనుచిత వ్యాఖ్యలతో భారత సమాజం ఏకమైందని, నగర అధికారులు భారత కమ్యూనిటీకి, జాహ్నవి మరణానికి తమ సంతాపాన్ని తెలియజేస్తున్నామని బ్రూస్ హారెల్ తెలిపారు.


అయితే ఈ ఘటనపై డేనియల్ వివరణ ఇస్తూ ఉన్నతాధికారులకు రాసిన లేఖను కూడా పోలీస్ అధికారుల గిల్డ్‌ విడుదల చేసింది. లాయర్లను ఉద్దేశించి తాను ఈ వ్యాఖ్యలు చేసినట్లు డేనియల్‌ ఇందులో వివరణ ఇచ్చారు. ‘‘జనవరి 23న పెట్రోలింగ్ వాహనం ఢీకొట్టడంతో ప్రమాదం జరిగిందని తెలిసి సాయం చేయడానికి వెళ్లాను. అక్కడ నుంచి తిరిగొస్తుండగా తోటి అధికారికి ఫోన్‌ చేసి ఘటన గురించి వివరించాను... అప్పటికి నా విధులు పూర్తయ్యాయి.. అయితే బాడీక్యామ్‌ కెమెరా ఆన్‌లో ఉన్న సంగతి నేను గ్రహించలేదు.. నా వ్యక్తిగత సంభాషణ అందులో రికార్డయ్యింది. అయితే, నేను కేవలం లాయర్ల వాదనల గురించే మాట్లాడాను.. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మనిషి ప్రాణం విలువ గురించి ఇరు పక్షాల లాయర్లు ఎలా వాదిస్తారో, బేరసారాలకు దిగుతారో గతంలో చాలా సార్లు ప్రత్యక్షంగా చూశాను. అవి ఎంత హాస్యాస్పదంగా ఉంటాయో గుర్తొచ్చి నవ్వుకున్నాను’ అని డేనియల్‌ తన లేఖలో వివరించారు


అంతేగానీ, భారతీయ విద్యార్ధిని మరణాన్ని తక్కువచేసి.. అవమానించేలా తాను ఉద్దేశపూర్వకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు. పూర్తి వివరాలు తెలియకుంటే ఇలాంటి దురదృష్టకర ఊహాగానాలే వైరల్‌ అవుతాయని డేనియల్ అన్నారు. ఈ అంశంపై పారదర్శకంగా విచారణ జరగాలని, ఉన్నతాధికారులు తనకు ఏ శిక్ష విధించినా ఎదుర్కొనేందుకు సిద్ధమేనని తెలిపారు.

ఇదిలా ఉంటే ఇండియన్ కమ్యూనిటీకి చెందిన 20 మంది ప్రముఖులతో సియాటెల్ మేయర్, పోలీస్ చీఫ్ శనివారం సమావేశమయ్యారు. పొరుగువారిని రక్షించే, గౌరవించే సియాటెల్ నగరాన్ని రూపొందిస్తామని వారు హామీ ఇచ్చారు. మరోవైపు డేనియల్‌ను ఉద్యోగం నుంచి తొలగించాలని అమెరికాలో ఆన్‌లైన్‌ పిటిషన్లు మొదలయ్యాయి.

Tags

Read MoreRead Less
Next Story