ఆకలితో అల్లాడుతోన్న అఫ్గానిస్థాన్.. 30శాతానికిపైగా పౌరులకి ఒక పూట భోజనమే..!

అఫ్గనిస్తాన్ నుంచి అమెరికా బలగాలు పూర్తిగా నిష్క్రమించిన నేపథ్యంలో దేశ పరిపాలనా వ్యవహారాలపై తాలిబన్లు దృష్టి కేంద్రీకరించారు. ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. గతంలో ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి కొందరు నేతలు, ఇతర ప్రముఖులతో తాము విస్తృతస్థాయిలో సంప్రదింపులు జరిపామని తాలిబన్ సాంస్కృతిక కమిషన్ తెలిపింది. సమ్మిళిత ప్రభుత్వ ఏర్పాటు, కేబినెట్ కూర్పుపై ఏకాభిప్రాయం కుదిరిందని చెప్పారు. రోజువారీ పరిపాలనా వ్యవహారాలను బారాదర్ నేతృత్వంలోని ప్రత్యేక మండలి చూసుకునే అవకాశముందని వెల్లడించారు. పరిపాలన కోసం ఎలాంటి మండలి ఏర్పాటయినా.. తాలిబన్ సుప్రీం లీడర్ హైబతుల్లా అఖుంద్‌జాదా అధినాయకుడిగా ఉంటారని అన్నారు.
ఆయన కనుసన్నల్లోనే తాము నడుచుకుంటామని తెలిపారు. అఖుంద్‌జాదా ప్రస్తుతం కాందహార్‌లో ఉన్నాడు. ఆయన, బరాదర్ త్వరలోనే కాబుల్‌లో బహిరంగంగా కనిపించే అవకాశాలున్నాయి. అఫ్గాన్ నుంచి అమెరికా సైన్యం వెళ్లిపోవడంతో తాలిబన్లలో ఉత్సాహం కనిపిస్తోంది. అగ్రరాజ్య బలగాలు వదిలి వెళ్లిన రక్షణ సామగ్రి, అఫ్గన్ సైన్యం నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాలను వారు కాందహార్‌లో ప్రదర్శించారు. వాటితో కవాతు నిర్వహించారు. ఆకుపచ్చని హమ్వీ వాహనాలు, బ్లాక్ హాక్ హెలికాప్టర్ వంటివి ప్రదర్శనలో పెట్టారు.
అఫ్గనిస్తాన్‌లో పరిస్థితులు రోజురోజుకు దిగజారుతున్నాయి. ఆహార సంక్షోభం తీవ్రమవుతుందనే వార్తలు అఫ్గన్ వాసుల్ని మరింత కలవరపెడుతున్నాయి. ఇప్పటికే దేశంలో 30శాతానికిపైగా పౌరులు నిత్యం కనీసం ఒకపూట భోజనం చేస్తున్నారో లేదో తెలియని పరిస్థితులు నెలకొన్నాయని ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. ఇదే సమయంలో దేశంలో ప్రస్తుతమున్న ఆహార నిల్వలు కూడా ఈ నెలతోనే పూర్తిగా ఖాళీ అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అఫ్గన్‌లో నెలకొన్న సంక్షోభం రానున్న రోజుల్లో ఓ విపత్తుగా మారకుండా ఆదుకునేందుకు అంతర్జాతీయ సమాజం ముందుకు రావాలని పిలుపునిచ్చింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com