US-Iran Peace Talks: విమానంలో రక్తంతో తడిసిన బ్యాగులు, బూట్లు..

ఇరాన్, అమెరికా నేతల మధ్య ఇవాళ ఇస్లామాబాద్‌లో చర్చలు(US-Iran Peace Talks) జరగనున్నాయి. ఈ చర్చల్లో పాల్గొనేందుకు ఇరాన్ స్పీకర్ మొహమ్మద్ బాగేర్ ఘాలిబఫ్ నేతృత్వంలోని బృందం పాకిస్థాన్ పయనమైంది. అయితే స్పీకర్ ఘాలిబఫ్ తన ఎక్స్ అకౌంట్‌లో ఓ ఫోటో పోస్టు చేశారు. ఈ విమానంలో నా తోటి ప్రయాణికులు వీళ్లే అని ఆ పోస్టుకు కామెంట్ ట్యాగ్ చేశారు. మినాబ్ 168 అని రాశారు. అయితే ఫిబ్రవరి 28వ తేదీన ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దళాలు ఆకస్మికంగా దాడి చేసిన విషయం తెలిసిందే. ఆ రోజున మినాబ్‌లో ఉన్న ఓ పాఠశాలపై కూడా బాంబుల వర్షం కురిసింది. ఆ ఘటన వల్ల ఆ స్కూల్‌లో ఉన్న సుమారు 168 మంది చిన్నారులు మృతిచెందారు. ఆ హృదయవిదారకర ఘటనను స్మరిస్తూ ఘాలిబఫ్ చేసిన పోస్టు అందర్నీ కలచివేస్తున్నది.
ఇస్లామాబాద్ చర్చలకు వస్తున్న ఇరాన్ బృందానికి మినాబ్ 168ని ఆయన పేరు పెట్టారు. ఇక మినాబ్ ఘటనను గుర్తు చేసేలా.. విమానంలోని ముందు వరుసలో దాడి వల్ల ప్రాణాలు కోల్పోయిన చిన్నారుల ఫోటోలు, స్కూల్ బ్యాగ్‌లు, పువ్వులు పెట్టారు. యుద్ధం మిగిల్చిన అవశేషాలు అన్న రీతిలో ఆ ఫోటోలో ఆవేదన వ్యక్తం చేశారు. స్పీకర్ ఘాలిబఫ్ పోస్టు చేసిన ఫోటోను దక్షిణాఫ్రికాలోని ఇరాన్ ఎంబసీ కూడా రీట్వీట్ చేసింది. మినాబ్ చిన్నారులను తాము ఎన్నటికీ మరవబోమన్నారు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
