Donald Trump: గ‌ర్భిణీ స్త్రీలు పారాసెటమాల్ వాడొద్దు: డొనాల్డ్ ట్రంప్

Donald Trump: గ‌ర్భిణీ స్త్రీలు పారాసెటమాల్ వాడొద్దు: డొనాల్డ్ ట్రంప్
X
ట్రంప్ ఆరోపణల్లో శాస్త్రీయత లేదంటూ స్పష్టం చేసిన ఆరోగ్య నిపుణులు

గర్భధారణ సమయంలో పారాసెటమాల్ వాడితే పిల్లల్లో ఆటిజం వచ్చే ప్రమాదం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపాయి. అయితే ఈ వ్యాఖ్యలను ప్రముఖ ఆరోగ్య నిపుణులు తీవ్రంగా ఖండించారు. పారాసెటమాల్ వాడకానికి, ఆటిజానికి మధ్య సంబంధం ఉందని చెప్పడానికి ఎలాంటి బలమైన శాస్త్రీయ ఆధారాలు లేవని వారు స్పష్టం చేశారు. గర్భిణులు ఈ విషయంలో అనవసరంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.

సోమవారం వైట్‌హౌస్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. గర్భిణులు పారాసెటమాల్ (ఎసిటమైనోఫెన్)కు దూరంగా ఉండాలని, నొప్పిని భరించాలే తప్ప మందులు వాడకూడదని వ్యాఖ్యానించారు. టైలనాల్ (Tylenol) వంటి మందులు మంచివి కావని, తీవ్రమైన జ్వరం వస్తే తప్ప వాటిని తీసుకోకూడదని ఆయన సూచించారు. ఈ వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా గర్భిణులలో ఆందోళనలకు దారితీశాయి.

ట్రంప్ వ్యాఖ్యలపై భారత వైద్య నిపుణులు స్పందించారు. ఢిల్లీలోని గురు తేగ్ బహదూర్ హాస్పిటల్ పీడియాట్రిక్స్ విభాగాధిపతి డాక్టర్ మనీష్ నారంగ్ మాట్లాడుతూ.. "గర్భధారణ సమయంలో పారాసెటమాల్ వాడితే ఆటిజం వస్తుందన్న ట్రంప్ వాదనకు బలమైన శాస్త్రీయ ఆధారాలు లేవు. ఇప్పటివరకు జరిగిన అధ్యయనాలు పరిమితమైనవి, వాటి ఫలితాలు కూడా పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. ఇలాంటి నిరాధార ఆరోపణల వల్ల తల్లిదండ్రుల్లో అనవసర భయాలు నెలకొంటాయి" అని ఆయన వివరించారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) మాజీ చీఫ్ సైంటిస్ట్, శిశువైద్య నిపుణురాలు డాక్టర్ సౌమ్య స్వామినాథన్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పారాసెటమాల్ ఎన్నో ఏళ్లుగా సురక్షితమైన మందుగా నిరూపితమైందని, దాని వాడకంపై భయపడాల్సిన పనిలేదని ఆమె తెలిపారు. పారాసెటమాల్‌కు, ఆటిజానికి సంబంధం ఉన్నట్లు శాస్త్రీయంగా నిరూపణ కాలేదని ఆమె స్పష్టం చేశారు.

అమెరికన్ కాలేజ్ ఆఫ్ అబ్‌స్టెట్రిషియన్స్ అండ్ గైనకాలజిస్ట్స్ వంటి ప్రముఖ సంస్థలు కూడా గర్భధారణ సమయంలో సురక్షితమైన నొప్పి నివారణిగా ఎసిటమైనోఫెన్‌ను సిఫార్సు చేస్తున్నాయి.మరోవైపు, గైనకాలజిస్ట్ డాక్టర్ అభా మజుందార్ మాట్లాడుతూ, "భయంతో చికిత్స మానేయడం సరికాదు. అదే సమయంలో, దీర్ఘకాలం పాటు అధిక మోతాదులో మందులు వాడటం వల్ల కలిగే నష్టాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. గర్భధారణ సమయంలో జ్వరం లేదా నొప్పిని నిర్లక్ష్యం చేయడం కూడా బిడ్డ అభివృద్ధిపై ప్రభావం చూపుతుంది. కాబట్టి, అవసరమైనప్పుడు వైద్యుని సలహాతో సాధ్యమైనంత తక్కువ డోసులో, తక్కువ కాలం పాటు మందులు వాడటం ఉత్తమం" అని సూచించారు.

Tags

Next Story