US: అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో పేలుతున్న మాటల తూటాలు

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం పోటీపడుతున్న భారతీయ అమెరికన్ నిక్కీ హేలీ.. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై సంచలన విమర్శలు చేశారు. ట్రంప్ మానసిక పరిస్థితి సరిగా లేదని, వయో భారంతో అధ్యక్ష బాధ్యతలను నిర్వహించలేరని హేలీ విమర్శించారు. ఎన్నికల ర్యాలీలో ట్రంప్ తన పేరును పదేపదే ప్రస్తావిస్తున్నారన్న హేలీ... 2021 జనవరి 6న క్యాపిటల్ భవనంపై దాడి సమయంలో నేను సరైన భద్రతా చర్యలు తీసుకోలేదని ఆరోపించారని గుర్తు చేశారు. నాడు తాను ఆ భవన భద్రతకు బాధ్యురాలిగా ఉన్నానని ఆయన భావిస్తున్నారని.... తనను నాన్సీగా పొరబడ్డారని ఎద్దేవా చేశారు. వాస్తవానికి 2021 జనవరి 6న తాను వాషింగ్టన్ డీసీలో లేను. ప్రపంచంలో పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్నప్పుడు 80 ఏళ్ల నిండిన బైడెన్, ట్రంప్ వంటి వ్యక్తులు అధ్యక్షులుగా మనకు అవసరమా’ అని నిక్కీ ప్రశ్నించారు.
తనకు తల్లిదండ్రులు మొదటపెట్టిన ‘నమ్రత’ను నింబ్రతగా ట్రంప్ ఉచ్ఛరించడాన్ని, తద్వారా తన భారతీయ మూలాలను తెరపైకి తీసుకురావడాన్ని కూడా ఆమె ప్రస్తావించారు. ట్రంప్ గురించి తనకు బాగా తెలుసని... ఆయన అభద్రతాభావానికి గురైనప్పుడే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారని నిక్కీ విమర్శించారు. చైనా, రష్యా, ఉత్తర కొరియా అధ్యక్షుల పేర్లు పరోక్షంగా ప్రస్తావిస్తూ నియంతలతో ట్రంప్‌నకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. రిపబ్లికన్ పార్టీలో అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం జరుగుతున్న అంతర్గత ఎన్నికల్లో ట్రంప్ ముందంజలో ఉన్నారు. తర్వాతి స్థానంలో నిక్కీ కొనసాగుతున్నారు. తాజా సర్వేల ప్రకారం వీరిద్దరి మధ్య వ్యత్యాసం 10 శాతం మాత్రమేనని తెలుస్తోంది. మరోవైపు ఎన్నికల ప్రచారసభలో.. నిక్కీ సొంత రాష్ట్రం దక్షిణ కరోలినాకు చెందిన నేతలు తన చుట్టూ ఉండేలా ట్రంప్ చూసుకున్నారు. తద్వారా న్యూహామ్‌షైర్‌లో జరిగే అంతర్గత ఎన్నికలకు ముందు తన బలాన్ని చాటేందుకు ప్రయత్నించారు.
ఇప్పటికే భారత సంతతి వ్యక్తి వివేక్ రామస్వామి అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి వైదొలిగారు. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఆయన మద్ధతు ప్రకటించారు. 2024 అమెరికా అధ్యక్ష ప్రాథమిక ఎన్నికల్లో భాగంగా అయోవా రాష్ట్రం నుంచి ప్రెసిడెన్షియల్ నామినేషన్ కోసం రిపబ్లికన్ పార్టీ నిర్వహించిన ఎన్నికల ప్రక్రియలో పేలవ రీతిలో వెనుకబడడంతో రామస్వామి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరి 2023లో ఆయన అధ్యక్ష ఎన్నికల రేసులోకి దూసుకొచ్చి హాట్ టాపిక్‌గా మారారు. ఇమ్మిగ్రేషన్, ‘అమెరికా ఫస్ట్’ నినాదాలతో ఆయన ఆకర్షించారు. తన బలమైన అభిప్రాయాలతో మొదట్లో చాలామందిని ఆకట్టుకున్నారు. ప్రెసిడెన్షియల్ రేసులో రిపబ్లికన్ ఓటర్లలో దృష్టిని ఆకర్షించగలిగారు. అయితే రామస్వామి ప్రచార వ్యూహం, విధానాలు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నినాదాలకు దగ్గరగా ఉండడం మైనస్ అయ్యింది. దానికి తోడు రామస్వామిపై ట్రంప్ బహిరంగంగానే విరుచుకుపడుతూ వచ్చారు. ఒహియో స్థానికుడైన వివేక్ రామస్వామి కేరళ నుంచి వలస అమెరికాకు వలస వెళ్లిన తల్లిదండ్రులకు జన్మించాడు. అధ్యక్ష ఎన్నికల రేసులో నిలిచి ప్రధాన పోటీదారుల్లో ఒకరిగా నిలిచిన విషయం తెలిసిందే.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com