Pakistan: 40% జనాభా దారిద్య్ర రేఖకు దిగువనే!

Pakistan:  40% జనాభా దారిద్య్ర రేఖకు దిగువనే!
సాధారణ ఎన్నికలకు ముందు ప్రపంచ బ్యాంకు హెచ్చరిక

పాకిస్థాన్‌ కు ప్రపంచ బ్యాంకు తాజాగా హెచ్చరిక జారీ చేసింది. దేశంలో సుమారు 40% జనాభా దారిద్య్ర రేఖకు దిగువన నివసిస్తోందని స్పష్టం చేసింది. గడచిన ఏడాది కాలంలో అక్కడి 1.25 కోట్లమంది ప్రజలు కఠిన దారిద్య్రంలోకి చేరుకున్నారని తాజాగా ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలో ప్రజలు తమ కనీస అవసరాలకు కూడా దిక్కులేని పరిస్థితిలో ఉన్నారనీ, ఆర్థిక స్థిరత్వం కోసం పాక్‌ అత్యవసరంగా చర్యలు చేపట్టాలని సూచించింది . 2021లో ఆ దేశంలో 34.2శాతం మంది పేదరికంలో ఉంటే, గత ఏడాది అది 39.4శాతానికి చేరింది. మొత్తంగా దేశంలో 9.5కోట్లమంది అత్యంత పేదరికంలో మగ్గిపోతున్నారని, దక్షిణాసియా మొత్తంలో అత్యల్ప తలసరి ఆదాయం పాకిస్థాన్‌దే అని స్పష్టం చేసింది. ప్రపంచంలోనే పాఠశాల విద్యను ఆపేసిన పిల్లల సంఖ్యలోనూ ఇస్లామాబాద్‌ అగ్రస్థానంలో ఉండాని అని ప్రపంచబ్యాంకు వెల్లడించింది.

ద్రవ్యోల్బణం, పెరుగుతున్న విద్యుత్ చార్జీలు, అభివృద్ధి అనుకూలతకు ఆర్థికంగా తగినంత ప్రజా వనరులతో సహా అనేక ఆర్థిక కష్టాలను పాకిస్తాన్ ఎదుర్కొంటుందని ప్రపంచ బ్యాంక్ అధికారులు తెలిపారు. తీవ్ర ద్రవ్యోల్బణంతో పాకిస్థాన్ భారీ ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ఎన్నికల తర్వాత రాబోయే ప్రభుత్వమైనా దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని ప్రపంచ బ్యాంకు సూచించింది. పాకిస్థాన్ దేశంలో సైనిక, రాజకీయ విధాన నిర్ణయాలు నేతల స్వార్థ ప్రయోజనాలతో ప్రభావితమవుతున్నాయని పాకిస్తాన్‌లోని ప్రపంచ బ్యాంకు యొక్క కంట్రీ డైరెక్టర్ నజీ బాన్‌హాస్సిన్ వ్యాఖ్యానించారు. పాకిస్థాన్ దేశం మూలధన సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. 2000, 2020 మధ్యకాలంలో పాకిస్థాన్ దేశం సగటు వాస్తవ తలసరి వృద్ధి రేటు కేవలం 1.7 శాతం మాత్రమే ఉంది. పాకిస్థానీ రూపాయి విలువ ఇంటర్‌బ్యాంక్ మార్కెట్‌లో డాలర్‌తో పోలిస్తే రికార్డు స్థాయిలో పడిపోయింది.


మరోవైపు పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ కూటమి ఐదేళ్ల పాలన గడువు ముగిసేలోపే పాక్‌ పార్లమెంట్‌ను రద్దు చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వ ఐదేళ్ల రాజ్యాంగ పదవీకాలం ఆగస్టు 12న అర్ధరాత్రితో ముగియనుండగా.. అంతకు ముందే ఆగస్టు 9వ తేదీనే పార్లమెంట్‌ రద్దుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను అధ్యక్షుడు ఆరిఫ్‌ అల్వీకి.. అప్పటి ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ పంపారు. దీంతో ఆయన ఆమోద ముద్రతో పాక్‌ పార్లమెంట్‌ రద్దయింది. పాక్ రాజ్యాంగం ప్రకారం.. అసెంబ్లీని రద్దు చేస్తే 60 రోజుల్లోగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ఒకవేళ 5 ఏళ్ల నిర్ణీత గడువుకు ముందే ప్రభుత్వం కూలిపోతే, లేక పార్లమెంట్ ముందే రద్దయితే పాకిస్థాన్ ఎన్నికల సంఘం 90 రోజుల్లోగా సాధారణ ఎన్నికలను నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలోనే దేశంలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు పాకిస్థాన్‌ ఎలక్షన్‌ కమిషన్‌ తాజాగా ప్రకటించింది.

Tags

Read MoreRead Less
Next Story