S Jaishankar: చైనా పర్యటనకు వెళ్లనున్న జైశంకర్..ఐదేళ్లలో ఇదే తొలిసారి..

S Jaishankar: చైనా పర్యటనకు వెళ్లనున్న జైశంకర్..ఐదేళ్లలో ఇదే తొలిసారి..
X
రెండు దేశాల సంబంధాల పునరుద్ధరణకు కృషి..

భారతదేశ విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ చైనా పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఐదేళ్లలో మొదటిసారిగా ఈ వీకెండ్‌లో చైనాను సందర్శిస్తారని పలు రిపోర్టులు చెబుతున్నాయి. 2020లో గల్వాన్ ఘర్షణ జరిగిన తర్వాత, ఇరు దేశాలు తమ సంబంధాలను సాధారణం చేసుకునేందుకు కృషి చేస్తున్నాయి. ఈ పర్యటనలో జైశంకర్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నారు.

జూలై 14-15 తేదీలలో జరిగే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ విదేశాంగ మంత్రుల మండలి సమావేశంలో పాల్గొనడానికి టియాంజిన్‌ జైశంకర్ వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలోనే ఇరు దేశాల విదేశాంగ మంత్రుల మధ్య చర్చలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. భారతదేశానికి సంబంధించి రేర్ ఎర్త్ మెటీయల్స్ సరఫరాపై చర్చించే అవకాశం ఉంది. దీంతో పాటు రెండు దేశాల మధ్య విమాన సర్వీసుల పునరుద్ధరణపై నిర్ణయం తీసుకోనున్నారు.

ఇటీవల దలైలామా వారసత్వం, ఇటీవల భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తత వంటి అంశాలపై కూడా ఇద్దరు మంత్రులు చర్చించే అవకాశం ఉందని విషయం తెలిసిన వ్యక్తులు చెప్పారు. గతేడాది చివర్లో ఇరుపక్షాల మధ్య ఉద్రిక్తతలు తగ్గడం ప్రారంభించినప్పటి నుంచి భారత అధికారులు చైనాకు వెళ్లడం ఇదే తొలిసారి అవుతోంది. గత నెలలో, కింగ్‌డావోలో జరిగిన SCO రక్షణ మంత్రుల సమావేశంలో పాల్గొనడానికి భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చైనాను సందర్శించారు.

ఈ ఏడాది ఎస్‌సీఓ శిఖరాగ్ర సమావేశానికి భారత ప్రధాని నరేంద్రమోడీ వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో భారతదేశంలో చైనా రాయబారి ప్రధాని మోడీని హృదయపూర్వకంగా ఆహ్వానించినట్లు చెప్పారు. అయితే, భారత్ ప్రధాని హజరును ధ్రువీకరించలేదు. దీంతో పాటు వాంగ్ యీ సరిహద్దులపై చర్చించేందుకు జూలైలో అజిత్ దోవల్‌తో చర్చలు జరిపేందుకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Tags

Next Story