Israel Hamas War : నెత్తురోడుతున్న గాజా

Israel Hamas War :  నెత్తురోడుతున్న గాజా
గాజా ఆసుపత్రుల్లో పరిస్థితి దయనీయం

హమాస్‌ ఉగ్రవాదుల దాడికి ప్రతీకారంగా ఇజ్రాయెల్‌ సైన్యం Israel Hamas War Latestపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతోంది. రెండు వారాలకు పైగా కొనసాగుతున్న ఈ భీకర దాడుల కారణంగా పాలస్తీనాలో చిన్నారులు, మహిళలతో పాటు సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు. అక్టోబర్‌ 7 నుంచి ఇప్పటివరకు ఇజ్రాయెల్‌ జరిపిన దాడుల్లో 5,087మంది పాలస్తీనా పౌరులు మృతిచెందినట్టు గాజా అధికారులు వెల్లడించారు. వీరిలో 2,055 మంది చిన్నారులు, 1,119 మంది మహిళలే ఉన్నారన్నారు. మరోవైపు 15వేల మందికి పైగా పౌరులు గాయపడినట్లు తెలిపారు.

ఇదిలా ఉండగా.. గాజా స్ట్రిప్‌లో పరిస్థితులు అత్యంత దయనీయంగా తయారయ్యాయి. అక్కడి ఆస్పత్రుల్లోని ఇంక్యుబేటర్లలో ఉన్న శిశువుల విషయంలో ఎన్‌ఐసీయూ వైద్యులు ఆందోళన చెందుతున్నారు. ఇంక్యుబేటర్లకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోతే నిమిషాల్లో వ్యవధిలోనే అనేకమంది శిశువులు ప్రాణాలు కోల్పోతారని ఆవేదన చెందుతున్నారు. ‘‘అత్యంత సంక్లిష్టమైన ఈ విభాగానికి అవసరమైన వైద్య సామగ్రిని పంపించాలని మేం ప్రతి ఒక్కరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. లేదంటే భారీ విపత్తు ఎదురవుతుంది’’ అని గాజా నగరంలోని అల్-షిఫా ఆసుపత్రిలో వైద్యుడు నాసర్ బుల్బుల్ అన్నారు. ఒకవేళ విద్యుత్‌ సరఫరా నిలిచిపోతే.. ఇంక్యుబేటర్లలో ఉన్న 55 మంది చిన్నారులను కాపాడుకోలేమన్నారు.


గాజాస్ట్రిప్‌ వ్యాప్తంగా ఎలక్ట్రిక్‌ ఇంక్యుబేటర్లలో మొత్తంగా 130 మంది శిశువులు ఉన్నట్లు గాజా ఆరోగ్య మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి అష్రఫ్‌ అలీ ఖుద్రా తెలిపారు. ఆస్పత్రుల్లో జనరేటర్లు, ముఖ్యంగా గాజాలో 13 ప్రభుత్వ ఆస్పత్రుల్లో అతి పెద్దదైన అల్‌- షిఫా ఆస్పత్రిలో సైతం ఇంధనం నిండుకుందని తెలిపారు. ఇంక్యుబేటర్లు సహా అత్యంత అవసరమైన వాటికి మాత్రమే ఇంధనాన్ని వినియోగిస్తున్నామని, అది ఎంత సమయం పాటు వస్తుందో తెలియడంలేదని ఆందోళన వ్యక్తంచేశారు. అందువల్ల ఇంధన సాయం కోసం యావత్ ప్రపంచానికి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. తమ దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు పెట్రోల్‌ బంకులను సైతం ఆస్పత్రుల్లో ప్రాణాలు కాపాడేందుకు అవసరమైన ఇంధనాన్ని సాధ్యమైనంత వరకు విరాళంగా ఇవ్వాలని కోరినట్లు ఆయన చెప్పారు.

మరోవైపు ఇజ్రాయెల్‌ నుంచి భారతీయులను వెనక్కి తీసుకొచ్చేందుకు.. ప్రారంభించిన ఆపరేషన్‌ అజయ్‌లో భాగంగా ఆరో విడతలో 143 మంది.. స్వదేశానికి చేరుకున్నారు. ఇద్దరు నేపాల్ పౌరులతో సహా మెుత్తం 143 మంది ప్రయాణికులతో కూడిన విమానం దిల్లీకి చేరుకుంది.

స్వదేశానికి చేరుకున్న భారతీయులకు కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగన్‌ సింగ్‌ స్వాగతం పలికారు.తమను సురక్షితంగా భారత్‌కు తీసుకురావడంపై వారు ఆనందం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు.ఇజ్రాయెల్‌ - హమాస్‌ మధ్య యుద్ధం కారణంగా ఇజ్రాయెల్‌లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఆపరేషన్‌ అజయ్‌ను భారత ప్రభుత్వం ప్రారంభించింది. ఈ ఆపరేషన్‌లో భాగంగా ఇప్పటివరకు 1300 మందికి పైగా భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చింది.

Tags

Read MoreRead Less
Next Story