Zelensky : హత్యకు కుట్ర, ఇన్‌ఫార్మర్ అరెస్ట్

ఉక్రెయిన్‌పై దాడి మొదలుపెట్టిన రోజు నుంచి ఆ దేశ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీని హతమార్చేందుకు రష్యా కుట్రలు పన్నుతూనే ఉంది. తాజాగా మరోసారి జెలెన్‌స్కీ హత్యకు రష్యా కుట్ర పన్నినట్లు వెల్లడైంది. జులై 27వతేదీన యుక్రెయిన్ పోర్ట్ సిటీ మైకోలైవ్ లో జెలెన్స్కీ పర్యటన సందర్భంగా అతన్ని హతమార్చేందుకు రష్యా కుట్ర పన్నింది. కానీ.. ఉక్రెయిన్ సెక్యూరిటీ సర్వీస్ ముందస్తు చర్యలు ఈ కుట్రని భగ్నం చేసాయి.
జెలెన్‌స్కీ ‘మైకోలైవ్’ పర్యటనకు వెళ్లినప్పుడు, మాస్కో సైన్యం వైమానిక దాడులకు కుట్ర పన్నిందని, ఈ పథకం గురించి ముందే సమాచారం అందడంతో అదనపు భద్రతా చర్యలు తీసుకోవడం జరిగిందని ఎస్‌బీయూ తాజాగా ప్రకటించింది. ఆ సందర్భంలో రష్యన్స్‌కు రహస్య సమాచారాన్ని అందిజేస్తున్న ఒక మహిళా ఇన్‌ఫార్మర్‌ను కూడా తాము కస్టడీలోకి తీసుకున్నట్టు పేర్కొంది.
జెలెన్స్కీ మైకోలైవ్ రహస్య పర్యటన సమాచారాన్ని యుక్రెయిన్ మహిళా గూఢచారి రష్యాకు చేరవేసిందని, ఈ సమాచారంతో రష్యా వైమానిక దాడి ద్వారా జెలెన్క్సీని హత మార్చేందుకు ప్లాన్ రూపొందించారని సమాచారం. జెలెన్క్సీ పర్యటన రూట్ మ్యాప్, సమయం తదితర వివరాలను మహిళా గూఢచారిణి రష్యాకు పంపిందని తేలింది.ఆ రష్యన్ ఇన్‌ఫార్మర్‌ను మైకోలైవ్‌లోని ఓచకోవ్ నివాసిగా గుర్తించారు.
గతంలో ఇక్కడి ఓ మిలిటరీ స్టోర్‌లో ఆమె సేల్స్‌వుమన్‌గా పని చేసిందని సమాచారం. మైకోలైవ్ ప్రాంతంలోని ఓచకివ్ పట్టణానికి సమీపంలో ఉన్న ఉక్రెయిన్ సైన్యం ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ వ్యవస్థలు, మందుగుండు సామగ్రి నిల్వ కేంద్రాలను గుర్తించే పని కూడా ఆమెకి అప్పగించినట్లు గుర్తించినట్లు ఆ సంస్థ వెల్లడించింది. ఆమె పలు చోట్ల పర్యటించి, ఫోటోలు తీసినట్లు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ఆమెని కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు. మరోవైపు జెలెన్క్సీ పర్యటనల సందర్భంగా అదనపు భద్రతా ఏర్పాటు చేశారు. మహిళా గూఢచారి దోషిగా తేలితే ఆమెకు 12 సంవత్సరాలపాటు జైలు శిక్ష విధించనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com