Pahalgam Terror Attack: జిప్‌లైన్ ఆపరేటర్ మూడుసార్లు అల్లాహు అక్బర్ ఆపై కాల్పులు

జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడికి ముందు ‘అల్లాహు అక్బర్’ అని నినదించిన జిప్‌లైన్ ఆపరేటర్‌కు జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ సమన్లు జారీచేసింది. ఉగ్రదాడి తర్వాత అక్కడున్న ప్రతి ఒక్కరినీ ప్రశ్నించేందుకు దర్యాప్తు అధికారులు సమన్లు ఇవ్వనున్నట్టు తెలిసింది. ఇందులో భాగంగానే జిప్‌లైన్ ఆపరేటర్‌ను ప్రశ్నించనున్నారు.
రిషిభట్ అనే పర్యాటకుడు జిప్‌లైన్‌పై ప్రయాణిస్తూ సెల్ఫీ తీసుకున్నాడు. ఈ సెల్ఫీ వీడియోలో ఆయనకు తెలియకుండానే ఉగ్రదాడి రికార్డయింది. దాడికి ముందు జిప్‌లైన్ ఆపరేటర్ ‘అల్లాహు అక్బర్’ అని నినదించడం ఆ వీడియోలో రికార్డయింది. ఈ వీడియోను భట్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆపరేటర్ ‘అల్లాహు అక్బర్’ అన్న వెంటనే ఉగ్రవాదుల కాల్పులు మొదలయ్యాయి. తాను జిప్‌లైన్‌లో ఎక్కకముందే తన భార్య, కుమారుడు, మరో నలుగురు సురక్షితంగా జిప్‌లైన్‌పై దాటారని భట్ తెలిపాడు.
జిప్‌లైన్ ఆపరేటర్ తొలుత ‘అల్లాహు అక్బర్’ అని అనలేదని, తాను జిప్‌లైన్‌లో ఉన్నప్పుడు ఆపరేటర్ మూడుసార్లు ‘అల్లాహు అక్బర్’ అని అన్నాడని, ఆ తర్వాత కాసేపటికే కాల్పులు ప్రారంభమయ్యాయని భట్ గుర్తు చేసుకున్నాడు. కాల్పులు జరిగినట్టు తెలుసుకోవడానికి తనకు 15 నుంచి 20 సెకన్ల సమయం పట్టినట్టు పేర్కొన్నాడు. తాను వీడియో తీస్తుండగా వెనకనున్న పర్యాటకుల్లో ఓ వ్యక్తి కిందపడటంతో ఏదో జరిగిందని అర్థమైందన్నాడు. ఆ వెంటనే తాను జిప్‌లైన్ రోప్‌ను ఆపేసి 15 అడుగుల ఎత్తు నుంచి కిందికి దూకేసినట్టు చెప్పాడు. ఆ వెంటనే భార్య, కుమారుడితో కలిసి పరుగులు తీశానని గుర్తుచేసుకున్నాడు. ఆ సమయంలో భార్య, కుమారుడితో కలిసి అక్కడి నుంచి బయటపడాలని మాత్రమే అనుకున్నానని వివరించాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com