Zubeen Garg: జుబీన్ గార్గ్ మృతిపై సింగపూర్ పోలీసులు సంచలన రిపోర్ట్..

ప్రముఖ గాయకుడు జుబీన్ గార్గ్ అనుమానాస్పద మృతి కేసులో సింగపూర్ పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. జుబీన్ గార్గ్ గత సంవత్సరం సెప్టెంబర్ 19న సముద్రంలో మునిగి మరణించారు. ఆయనను ఎవరైనా నీటిలోకి తోసేశారా లేదా ఆత్మహత్య చేసుకున్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరిపారు. ఈ కేసును దర్యాప్తు చేసిన సింగపూర్ పోలీసులు నివేదికను అక్కడి కరోనర్ కోర్టుకు సమర్పించారు.
ఈ నివేదికలో కొన్ని కీలక అంశాలు ఉన్నాయి. ఘటన జరిగిన సమయంలో జుబీన్ గార్గ్ మద్యం మత్తులో ఉన్నారని, లైఫ్ జాకెట్ ధరించడానికి కూడా నిరాకరించారని నివేదిక పేర్కొంది. సింగపూర్‌లో ఒక కార్యక్రమం కోసం వచ్చిన జుబీన్, ఒకరోజు ముందు విలాసవంతమైన నౌకలో స్నేహితులతో కలిసి విందు చేసుకున్నారని, ఆ సమయంలోనే నీటిలో మునిగి మరణించినట్లు పోలీసులు నివేదికలో తెలిపారు.
జుబీన్ గార్గ్ మొదట లైఫ్ జాకెట్ ధరించారని, కానీ ఆ తర్వాత తీసివేశారని వెల్లడించారు. స్నేహితులతో కలిసి విందు చేసుకుంటున్న సమయంలో జుబీన్ మద్యం మత్తులో ఉన్నారని పోలీసులు కోర్టుకు సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు. నీటిలో ఈత కొట్టిన జుబీన్ గార్గ్ నౌకలోకి తిరిగి వచ్చేందుకు ప్రయత్నించారని తెలిపారు. ఆయన అస్వస్థతకు గురికావడంతో నౌకలోని సిబ్బంది ఆయనను పైకి తీసుకువచ్చారని, కానీ అప్పటికే ఆయన మరణించారని పేర్కొన్నారు.
ప్రత్యక్ష సాక్షులు ఈ విషయాలు చెప్పారని పోలీసులు తమ నివేదికలో పొందుపరిచారు. జుబీన్‌కు అధిక రక్తపోటు, మూర్ఛ వ్యాధి ఉన్నట్లు విచారణలో తేలిందని పేర్కొన్నారు. ఈ కేసులో 35 మందిని విచారించామని, మృతిపై ఎలాంటి అనుమానాలు లేవని గుర్తించామని సింగపూర్ పోలీసులు కోర్టుకు తెలియజేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

