తెలంగాణ ప్రజలను కేసీఆర్‌ మోసం చేస్తున్నారు: షర్మిల

తెలంగాణ ప్రజలను కేసీఆర్‌ మోసం చేస్తున్నారు: షర్మిల
X

తెలంగాణ ప్రజలను కేసీఆర్‌ మోసం చేస్తున్నారని వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. కేసీఆర్‌కి పది ప్రశ్నలను సంధించారు. దశాబ్ది ఉత్సవాలు చేసే ముందు ఈ పది ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్‌ చేశారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేశారని ఆరోపించారు. పదేళ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని.. ఇంటికో ఉద్యోగం, దళిత ముఖ్యమంత్రి హామీ ఏమైందన్నారు. పదేళ్లలో ఏం ఉద్ధరించారని దశాబ్ది ఉత్సవాలు చేస్తున్నారని ప్రశ్నించారు.

తెలంగాణ పేరుతో ప్రాంతీయ పార్టీ ఉండటం ఇష్టం లేదా అని షర్మిల నిలదీశారు. రాష్ట్రంలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్‌లు ఇంతకాలం కేసీఆర్‌ మోచేతి నీళ్లు తాగాయని విమర్శించారు. ఆ పార్టీలు నిద్రపోతున్నాయనే.. తెలంగాణ ప్రజల పక్షాన పార్టీ పెట్టానన్నారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే కేసీఆర్‌కు ఓటేసినట్లేనని ఆరోపించారు. ఎట్టి పరిస్థితుల్లో తమ పార్టీని విలీనం చేయబోమని.. తెలంగాణలో ఒంటరిగా పోటీ చేస్తామని స్పష్టం చేశారు. అభ్యర్థులను సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు. ఈసారి కేసీఆర్‌కు 30 సీట్లకు మించి రావని జోస్యం చెప్పారు. అన్ని పార్టీలు కేసీఆర్‌కు వ్యతిరేకమని క్లారిటీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అప్పుడే పొత్తుల గురించి ఆలోచిస్తామని పేర్కొన్నారు. కేసీఆర్‌తో తమకు పొత్తు ఎప్పటికీ ఉండబోదని అన్నారు.

Tags

Next Story