జెడ్పీ పదవుల కోసం టీఆర్ఎస్ పార్టీలో మూడు వర్గాలు..!

పరిషత్ ఎన్నికల్లో గులాబీ క్లీన్ స్వీప్ చేసింది. ఇక ఇప్పుడు జడ్పీ చైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓడిన ఎమ్మెల్యేలు, సినియ‌ర్ లీడ‌ర్లు జడ్పీ పీఠం దక్కించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అటు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వారసులు కూడా తమ రూట్లో తాము ప్రయత్నాలు చేస్తుకుంటున్నారు. అయితే..నాయకత్వం ఎవరికి తీపికబుతు అందిస్తుందనేది ఆసక్తిగా మారింది.

తెలంగాణ‌ ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లో టీఆరెస్ తిరుగులేని మెజారిటీ సాధించింది. 32కు 32 జడ్పీ పీఠాలను కైవసం చేసుకుంది. దీంతో కొన్నాళ్లుగా పదవుల కోసం వేచి చూస్తున్న నేతలు జడ్పీ పదవుల కోసం పోటీ పడుతున్నారు. తమకు ఉన్న నెట్వర్క్ తో కేసీఆర్, కేటీఆర్ దగ్గర పైరవీలు చేసుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడినవాళ్లు, సీనియర్ నేతలు, ఎమ్మెల్యేల వారసులు ఇలా పార్టీలో మూడు వర్గాలు జడ్పీ పదవుల కోసం ప్రయత్నిస్తున్నాయి.

అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కొమ‌రం భీం ఆసిఫాబాద్ నుంచి పోటి చేసి ఓడిన కోవా ల‌క్ష్మి ఈ సారి జెడ్పీటిసిగా గెలిచారు. దీంతో జిల్లా ప‌రిష‌త్ ఛైర్మ‌న్ ప‌ద‌వి దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారామె. ఎస్టీ సామాజిక వ‌ర్గం, మాజీ ఎమ్మెల్యే కూడా కావ‌డంతో త‌న‌కే చాన్స్ ద‌క్కుతుంద‌ని అంచనాల్లో ఉన్నారు. ఇక మంథని నుంచి పోటి చేసి ఓడిన పుట్టా మ‌ధు పెద్ద‌ప‌ల్లి చైర్మ‌న్ ప‌ద‌వి కోసం పట్టుబడుతున్న‌ట్టు స‌మాచారం. ఈ మ‌ధ్యే టీఆర్ఎస్ లో చేరిన భూపాలప‌ల్లి ఎమ్మెల్యే గండ్ర వెంక‌ట‌ర‌మ‌ణరెడ్డి స‌తీమ‌ణి గండ్ర జ్యోతి వ‌రంగ‌ల్ రూర‌ల్ నుంచి గెలుపొంద‌డ‌టంతో ఆ జిల్లా చైర్ ప‌ర్స‌న్ ప‌ద‌విని ఇప్పుంచుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.

ఇల్లందులో ఎమ్మెల్యేగా పోటిచేసి ఓడిన కొరం క‌న‌క‌య్య ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లో గెల‌వ‌డంతో భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జెడ్పీ ఛైర్మ‌న్ ప‌ద‌వి కోసం ఆశ ప‌డుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మ‌ధిర నుంచి పోటిచేసి ఓడిన లింగాల క‌మ‌ల్ రాజ్ ఖ‌మ్మం ఛైర్మ‌న్ అయ్యేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఎమ్మెల్సీ గా ఎన్నికైన పట్నం మ‌హేంద‌ర్ రెడ్డి.. వికారాబాద్ జిల్లా ప‌రిష‌త్ ఛైర్మ‌న్ ప‌ద‌విని తన స‌తీమ‌ణి సునితా మ‌హేంద‌ర్ రెడ్డికి ఇప్పించుకునేందుకు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నారు. మ‌రో సీనియ‌ర్ నేత తీగ‌ల కృష్ణారెడ్డి.. తన కోడ‌లు తీగ‌ల అనిత‌కు రంగారెడ్డి జిల్లా చైర్మ‌న్ ప‌ద‌వి ఇవ్వాలని అధిష్టానాన్ని కోరుతున్నట్లు సమాచారం. ఇక మంచిర్యాల జిల్లా చైర్మ‌న్ ప‌ద‌విని మాజీ ఎమ్మెల్యే న‌ల్లాల ఓదేలు భార్య న‌ల్లాల భాగ్య‌ల‌క్ష్మికి ద‌క్కేలా పైరవీలు చేస్తున్నారు.

మాజీ ఎమ్మెల్యేలు, ప‌లువురు నేత‌ల వార‌సుల సంగ‌తిలా ఉంటే పార్టీలో మొద‌ట్నించి ప‌నిచేస్తూ ఎమ్మెల్యే సీటు ద‌క్క‌ని వారు మ‌రో ప‌ది మంది వ‌ర‌కూ జడ్పీటీసీలుగా గెలుపొందారు. చాన్నాళ్లుగా పదవులు లేకుండా పార్టీ కోసం కష్టపడిన వీరంతా ఇప్పుడు అవ‌కాశం ఉండ‌టంతో పార్టీ కొసం ప‌ని చేశాం కాబ‌ట్టి చైర్మ‌న్, వైస్ చైర్మ‌న్ ప‌ద‌వులు త‌మ‌కే కావాల‌ని తమ వాదన వినిపిస్తున్నారు. అయితే జడ్పీ చైర్మన్ ల ఎన్నికకు ఇంకా నాలుగు రోజులే మిగిలి ఉండ‌టంతో ఫైనల్ జాబితా విడుదల చేసే కసరత్తులో ఉంది అధష్టానం. దీంతో ఎవ‌రెవ‌రికి పీఠమెక్కే చాన్స్ ద‌క్కుతుందోన‌ని టిఆరెస్ లో తీవ్ర చ‌ర్చ జ‌రుగుతుంది.

Tags

Read MoreRead Less
Next Story